Nara Lokesh: ఉద్యోగుల పోరాటానికి తెదేపా అండ

హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 29 Mar 2023 06:38 IST

సకాలంలో జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం
ఉపాధ్యాయులపై అణచివేత చర్యలు దారుణం
యువగళం పాదయాత్రలో లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనత దేశ చరిత్రలో జగన్‌కే ఉందని అన్నారు. పాఠశాలల్లో టీచర్లకు పోలీసులను కాపలాపెట్టి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించని దుస్థితికి ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి నుంచి సోమందేపల్లి మండలం నల్లగొండరాయునిపల్లి వరకు 16 కి.మీ.సాగింది. ఈ సందర్భంగా గుమ్మయ్యగారిపల్లి వద్ద లోకేశ్‌ను సీపీఎస్‌ ఉద్యోగులు కలిసి సమస్యలను విన్నవించారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని చంద్రబాబు ఇచ్చారని లోకేశ్‌ గుర్తు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెదేపా అండగా నిలుస్తుందని, అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని అన్నారు.

మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు రిజర్వేషన్లు 

వైకాపా నాయకుల అక్రమ మద్యం వ్యాపారం కోసం గీత కార్మికులను జగన్‌ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని లోకేశ్‌ ఆరోపించారు. పాలసముద్రం వద్ద బీసీలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం గీత కార్మికులకు ‘ఆదరణ’ కింద పరికరాలనిచ్చిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. తెదేపా హయాంలో వడ్డెర్లకు ఇచ్చిన క్వారీలను వైకాపావారు లాక్కున్నారని, వాటిని తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములను వెనక్కు తీసుకుని పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఎస్టీల సంక్షేమానికి మాత్రమే వినియోగించాల్సిన రూ.5,355 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులను వైకాపా ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని ఆరోపించారు. ఇక్కడ ఏర్పాటైన కియా పరిశ్రమ చంద్రబాబు దార్శనికతను నిదర్శనమన్నారు. గోరంట్ల మండల పరిధిలోని కియా అనుబంధ సంస్థల వద్ద లోకేశ్‌ సెల్ఫీ తీసుకున్నారు. కంపెనీ ఫలాలు రాష్ట్రానికి అందుతుండటంతో తమ మహానేత రాసిన లేఖ వల్లే కియా వచ్చిందని నకిలీ ఉత్తరం సృష్టించి అసెంబ్లీలో చదివి అల్పసంతోషం పొందారని వ్యాఖ్యానించారు. కియా ఉద్యోగిని పద్మావతి లోకేశ్‌తోపాటు పాదయాత్రలో కొంతదూరం పాల్గొన్నారు. కొందరు ఉద్యోగులు ఆయనతో ఫొటో తీసుకున్నారు. లోకేశ్‌ వెంట ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, నాయకులు పార్థసారథి, సవిత, బీవీ వెంకట్రాముడు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని