కాంగ్రెస్‌లోని సీనియర్‌ న్యాయవాదులేమయ్యారు?

కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ న్యాయవాదులు ఏమయ్యారని, రాహుల్‌ గాంధీ కేసును ఎందుకు వాదించడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ప్రశ్నించారు.

Published : 29 Mar 2023 05:29 IST

రాహుల్‌ గాంధీ కేసును ఎందుకు వాదించడం లేదు?
కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ప్రశ్న

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ న్యాయవాదులు ఏమయ్యారని, రాహుల్‌ గాంధీ కేసును ఎందుకు వాదించడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్‌ పార్టీ కుట్రతోనే రాహుల్‌ బాధితుడయ్యారా అని నిలదీశారు. మంగళవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ విఫలమైన ఫిరంగిలాంటివారు. తరచూ చట్ట ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తి. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించినా మారలేదు’ అని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ అంటే భాజపా అతిగా భయపడుతోందా.. అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. అదానీ విషయంలో ఆర్‌బీఐ, సెబీవంటి సంస్థలు చేసిన హెచ్చరికలను పక్కదారి పట్టించేందుకే రాహుల్‌ గాంధీ అంశాన్ని తెరపైకి తెచ్చారా? అన్న ప్రశ్నలనూ ఠాకుర్‌ ఖండించారు. వీటిపై నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే సమాధానమిచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ జరుపుతోందని చెప్పారు.

*  ఓబీసీ వర్గానికి క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంద్వారా రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఆయనను ఏమీ చేయలేరని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. రాహుల్‌ను ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంపై స్పందిస్తూ.. అది ఆయన ఇల్లు కాదని, ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. రాహుల్‌కు ఇది కొత్తేమీ కాదని, ఓబీసీలను, గిరిజనులను ఆయన తరచూ అవమానిస్తుంటారని చెప్పారు.

అది దేశ అంతర్గత వ్యవహారం: అనురాగ్‌ ఠాకుర్‌

రాహుల్‌ గాంధీపై ఉన్న కోర్టు కేసును తమ దేశం గమనిస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తోసిపుచ్చారు. లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించిన అంశం భారత దేశ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. అమెరికా అధికారి ప్రకటన సాధారణంగానే ఉందని, అందులో విశేషమైనదేమీ లేదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘ఇది మన అంతర్గత వ్యవహారం. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ సంస్థ. మన దేశానికి రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలున్నాయి. అమెరికా ప్రకటన సాధారణంగానే ఉంది’’ అని మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్‌ ఠాకుర్‌ స్పందించారు.

అది మార్ఫింగ్‌ వీడియో: కాంగ్రెస్‌

ప్రసంగం సందర్భంగా వేర్వేరు అంశాలపై మాట్లాడిన మాటలను మార్ఫింగ్‌ చేసి స్మృతి ఇరానీని అవమానించినట్లుగా భాజపా చూపుతోందని కాంగ్రెస్‌ ప్రతి దాడి చేసింది. అనని మాటలను అన్నట్లుగా చూపాలనే సంస్కారాన్ని ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నేర్పారా అని ప్రశ్నించింది. లఖీంపూర్‌లో దారుణం జరిగినప్పుడు, షాజహాన్‌పుర్‌లో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్నప్పుడు స్మృతి మౌనంగా ఎందుకున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ నిలదీశారు. అదానీ, మోదీల సంబంధాన్ని రాహుల్‌ గాంధీ ప్రశ్నించేసరికి సమాధానమివ్వలేక భాజపా నేతలు ఇటువంటి అంశాలరు తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు.


అది రాహుల్‌, సోనియా నేర్పిన సంస్కారమా?
యూత్‌ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ

దిల్లీ: యూత్‌ కాంగ్రెస్‌ నేత బీవీ శ్రీనివాస్‌ తనపై చేశారంటున్న వ్యాఖ్యలను చూస్తే రాహుల్‌, సోనియాల నుంచే ఆయన నేర్చుకున్నట్లుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ఇదేనా రాహుల్‌, సోనియాలు పార్టీ యువ నేతలకు నేర్పే సంస్కారం అని ప్రశ్నించారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తేనే పార్టీలో పదవులు ఉంటాయని వారు చెబుతున్నారా.. అని నిలదీశారు. తనపై వ్యాఖ్యలు చేసేవారిలో శ్రీనివాస్‌ తొలి వ్యక్తి కాదని, చాలా మంది యువజన కాంగ్రెస్‌ నేతలకు ఇది అలవాటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం నిర్వహించిన సంకల్ప్‌ సత్యాగ్రహ కార్యక్రమంలో ఇరానీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో వైరలైంది. ‘2014లో ద్రవ్యోల్బణాన్ని భాజపా నేతలు భూతంగా చూపారు. ఇప్పుడు అదే ద్రవ్యోల్బణ భూతాన్ని ఆ నేతలు మెచ్చి తమ పడక గదుల్లోకి రానిస్తుంటే స్మృతి ఇరానీ కళ్లు మూసుకున్నారా?’ అని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించినట్లుగా ఆ వీడియోలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు