Pawan Kalyan: వైకాపా మైండ్‌గేమ్‌కు లొంగొద్దు

రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల విషయంలో జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ విషయంలో వైకాపా మైండ్‌గేమ్‌ ఆడుతోందని, దానికి ఎవరూ లొంగవద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

Updated : 31 Mar 2023 07:43 IST

పొత్తులు, పార్టీ వ్యూహంపై స్పష్టంగా చెబుతా
నాయకులకు జనసేన అధినేత  దిశానిర్దేశం?

ఈనాడు,ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల విషయంలో జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ విషయంలో వైకాపా మైండ్‌గేమ్‌ ఆడుతోందని, దానికి ఎవరూ లొంగవద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఆయన గురువారం కొద్దిమంది నాయకులకు ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ పార్టీశ్రేణులకు అంతర్గతంగా దీనిపై ఒక నోట్‌ పంపారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై పార్టీశ్రేణులు అనవసర ఆందోళన చెందవద్దని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించారని, ఆయన ఈ ప్రకటన చేసినప్పటి నుంచి వైకాపా మైండ్‌గేమ్‌ ఆడుతోందని జనసేన పార్టీ తమ శ్రేణులను గురువారం అప్రమత్తం చేసింది. ప్రతిపక్ష నాయకుల పేర్లతో, జనసేన నాయకుల పేర్లతో ఈ పొత్తులపై ఏవేవో మాట్లాడారన్నట్లుగా తప్పుడు ప్రకటనలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టించడమే ఈ క్రీడలో భాగంగా వ్యవహరిస్తున్నారని తెలియజేసింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ విషయంలో గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను పార్టీ నాయకులకు పవన్‌కల్యాణ్‌ పారదర్శకంగా తెలియజేస్తారన్నారు.

కౌలు రైతుల కష్టాలకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం

రాష్ట్రంలో మూడువేల మంది కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వైకాపా ప్రభుత్వంలో కనీస చలనం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. కౌలురైతుల కష్టాలకు రాష్ట్రప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతుస్వరాజ్య వేదిక రాష్ట్రకమిటీ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌తో సమావేశమయ్యారు. కౌలురైతుల ఇబ్బందులపై క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను ఈ సందర్భంగా వారు పవన్‌కల్యాణ్‌కు అందజేశారు. ‘రైతుల కష్టాలపై త్వరలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిద్దాం. రాష్ట్రంలో 80 శాతం వరి పంట కౌలు సేద్యం నుంచే వస్తుంది. వరితో పాటు మిర్చి, పత్తి వేసిన వారూ నష్టపోతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చేసిన రైతుభరోసా యాత్రల్లో 8 జిల్లాల్లో సుమారు 700 మందికి పైగా రైతులకు జనసేన ద్వారా ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. సమావేశంలో రైతుస్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్‌కుమార్‌, బి.కొండల్‌రెడ్డి, బాలు, కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు శ్రీహర్ష, భార్గవి పాల్గొన్నారు.

నిరాహార దీక్ష చేస్తే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులా?

ఏర్పేడు, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చిందేపల్లిలో రహదారి పునరుద్ధరణ కోసం నిరాహారదీక్ష చేస్తున్న గ్రామస్థులు, జనసేన శ్రేణులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని