ప్రభుత్వ ఆస్తుల విక్రయం ఆపండి: భట్టి

తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్‌ను సీఎల్పీ నేతగా కోరుతున్నానని భట్టి విక్రమార్క అన్నారు.

Published : 02 Apr 2023 04:09 IST

నెన్నెల, న్యూస్‌టుడే: తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్‌ను సీఎల్పీ నేతగా కోరుతున్నానని భట్టి విక్రమార్క అన్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో శనివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మెట్‌పల్లి, చిత్తాపూర్‌, కిష్టాపూర్‌, ఆవడం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆవడంలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూములను అయినవారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. వందల మంది యువకులు బలిదానం చేసి రాష్ట్రాన్ని సాధించింది ఆస్తులమ్మి అప్పుల తెలంగాణగా మార్చడానికి కాదన్నారు. సంపదను విక్రయించి పరిపాలన చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని భట్టి విమర్శించారు. తెలంగాణ స్కాంల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. ‘మిషన్‌ భగీరథలో రూ. వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ 200 కిలోమీటర్ల దూరం సాగిన నా పాదయాత్రలో ఒక్కరు కూడా తాగునీరు వస్తోందని చెప్పలేదు. కేవలం పైపులు బిగించి వదిలేశారు’ అని భట్టి తెలిపారు. నియోజకవర్గానికి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘వేల కోట్ల నిధులు గుత్తేదారులకు కట్టబెట్టి ఆస్తులు సంపాదిస్తున్నారు.. వాటిని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని