చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఉందా?

‘కిలో రెండు రూపాయల బియ్యం అంటే ఎన్టీఆర్‌.. ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తొస్తారు.

Published : 28 May 2023 06:05 IST

విశాఖకు రాజధాని వచ్చేసింది.. మనుషులు రావడమే తరువాయి
మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, విశాఖపట్నం: ‘కిలో రెండు రూపాయల బియ్యం అంటే ఎన్టీఆర్‌.. ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తొస్తారు. ఇలా ఒక సంక్షేమం పేరు చెబితే చంద్రబాబు పేరు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శనివారం విశాఖ వైకాపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంలో రాజకీయ డ్రామా జరుగుతోందని మహానాడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అబద్ధాలో, నిజాలో చెప్పి అధికారంలోకి రావడం ముఖ్యం కాదని, అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశామనేది కీలకమని అన్నారు. ‘మాటకు కట్టుబడతారు.. అందుకే జగన్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’ అని పేర్కొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ బోధనకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ రోజుకో డ్రామా ఆడుతోందని విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స విమర్శించారు. విశాఖ రాజధానిగా ఎప్పుడు పాలన ప్రారంభిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇక్కడికి రాజధాని ఇప్పటికే వచ్చేసిందని, మనుషులు రావడమే మిగిలిందని అన్నారు. అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలపై స్పందిస్తూ... ఊరంటే ఒకే సామాజికవర్గం ఉండాలంటూ రాజ్యాంగంలో లేదని, ఇళ్లులేని పేదలకు అక్కడ స్థలాలివ్వడం తప్పేంటని పేర్కొన్నారు. అమరావతి దేవేంద్రుడి నిలయమా? అని ప్రశ్నించారు. సమావేశంలో వైకాపా విశాఖ జిల్లా జిల్లా అధ్యక్షుడు పి.రమేష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని