119 సెగ్మెంట్లలో సభలు
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించే వారికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సూచించారు.
తొమ్మిదేళ్ల మోదీ పాలనపై ఇంటింటికీ భాజపా
నేటి నుంచి ‘మహాజన్ సంపర్క్ అభియాన్’: బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించే వారికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సూచించారు. కేంద్రంలో నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం నుంచి ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో చేపట్టే కార్యక్రమాల్లో కేంద్రం అమలుచేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. అభియాన్‌లో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 119 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల భాజపా పాలనపై రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 9090902024 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి మోదీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని సంజయ్ కోరారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినమైన జూన్ 23న ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కార్యక్రమాలు, 25న ‘మన్ కీ బాత్’, 21న యోగా డేను నిర్వహించాలన్నారు.కేంద్రం రాష్ట్రానికి 3.5 లక్షలకుపైగా ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 2.5 లక్షల ఇళ్లు అర్బన్ ఆవాస్ యోజన కింద మంజూరు చేసినవని సంజయ్ వివరించారు. వాటికి కేంద్రం రూ.4,466 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్రంలో ఇప్పటివరకు 30 వేల ఇళ్లను కూడా పూర్తి చేయలేదన్నారు.
ఇవీ కార్యక్రమాలు
* జూన్ 1-7: లోక్‌సభ స్థానాల వారీగా మీడియా సమావేశాలు, కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన
* 8-14: అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సీనియర్ నాయకుల సమ్మేళనాలు, మోర్చాల సంయుక్త సమ్మేళనం, నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులతో అత్మీయ సమావేశాలు
* 15-21: రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు
* 22-28: కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు.
బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్
రాష్ట్రంలో వెనుకబడినవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్‌ను రూపొందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ రూపకల్పనపై బుధవారం హైదరాబాద్‌లో భాజపా టాస్క్‌ఫోర్సు కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా సమగ్రంగా రూపొందించాలన్నారు. టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్ సీహెచ్.విఠల్ మాట్లాడుతూ సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను బీసీ డిక్లరేషన్‌లో పొందుపరుస్తామని చెప్పారు. పార్టీ నేత ఎస్.కుమార్ మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి సలహాలు స్వీకరిస్తామన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కమిటీ సభ్యులు, సంచార జాతులు, వివిధ కులవృత్తుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలి: సంజయ్
తెలంగాణచౌక్ (కరీంనగర్), న్యూస్‌టుడే: శంషాబాద్‌లో అమిత్‌షాకు ఓ వ్యాపారి ఇల్లు కట్టించాడని.. కేంద్ర హోంమంత్రి ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం అధినేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. ఆ విషయం ఆయనకే తెలియాలన్నారు. తమ పార్టీ అగ్రనేత సమాచారం తమకు తెలియకుండానే ఆయనకు తెలుస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దమ్ముంటే తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలి. భారాస, కాంగ్రెస్ సహా ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తారో చేయండి. భాజపా సింహంలా సింగిల్‌గానే పోటీ చేసి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తుంది’’ అని సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.