కార్మికుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మికుల కోసం ఎప్పుడూ ఆలోచించదని.. రైళ్లు, ఎల్‌ఐసీలు, విశాఖ ఉక్కు పరిశ్రమల్ని అమ్మేస్తూ కార్మికుల ఉసురుపోసుకుంటోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

Published : 01 Jun 2023 04:16 IST

మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, వరంగల్‌, బాలసముద్రం, ఎంజీఎం ఆసుపత్రి, నయీంనగర్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మికుల కోసం ఎప్పుడూ ఆలోచించదని.. రైళ్లు, ఎల్‌ఐసీలు, విశాఖ ఉక్కు పరిశ్రమల్ని అమ్మేస్తూ కార్మికుల ఉసురుపోసుకుంటోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం రాత్రి హనుమకొండలోని ఆర్ట్స్‌కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ ఏర్పాటు చేసిన ‘కార్మిక యుద్ధ భేరి’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల సంక్షేమం కోసమే ఆలోచిస్తుందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం పంపుల కోసం బీహెచ్‌ఈఎల్‌ తయారు చేసిన మోటార్లను వినియోగించామని అన్నారు. కేంద్రం రూపాయి విలువతోపాటు సిపాయి విలువ కూడా తగ్గించిందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మే నెలలో కార్మిక మాసోత్సవం నిర్వహించారన్నారు. 20 వేల మంది కార్మికులను రిజిస్టర్‌ చేసి వారి పిల్లలు ఉన్నత చదువులకు భరోసా ఇచ్చారని ప్రశంసించారు. అనంతరం కార్మిక కుటుంబాల వారికి చెక్కులు అందజేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

భాజపా, కాంగ్రెస్‌ పాలిస్తే రాష్ట్రంలో వైద్యమిలా ఉండేదా?

‘‘కాంగ్రెస్‌ పాలనలో సర్కారు దవాఖానాల్లో సూదులు, మందులు కూడా ఉండకపోయేవి. కేంద్రానిది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. కానీ కేసీఆర్‌ పాలనలో పేదలకు అత్యాధునిక వైద్యం అందుతోంది. భాజపా, కాంగ్రెస్‌లు పాలిస్తే వైద్యంలో రాష్ట్రం ఇలా ఉండేదా?’’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం వరంగల్‌లో మంత్రి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హంటర్‌ రోడ్డు సమీపంలోని ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల ప్రారంభోత్సవం తర్వాత హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రూ.3.85 కోట్లతో చేపట్టిన టీహబ్‌ రేడియాలజీ ప్రయోగశాల, అనంతరం కేఎంసీలో రూ.28 కోట్లతో నిర్మించిన అకాడమిక్‌ బ్లాక్‌, రీసెర్చ్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. తర్వాత హెల్త్‌ సిటీలో భాగంగా వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో హరీశ్‌రావుమాట్లాడారు. ‘‘వరంగల్‌లో హెల్త్‌సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదట 16 లక్షల చదరపు అడుగులు అనుకుంటే మరింత విశాలంగా ఉండాలని ముఖ్యమంత్రి భావించి 21.76 లక్షల చదరపు అడుగుల మేరకు ఆసుపత్రిని విస్తరించి 2100 పడకలు వచ్చేలా మార్చారు. ఈ ఆసుపత్రిలో మొదట పది అంతస్తులు పూర్తి చేసి సేవలు అందిస్తాం. దసరా నాటికి కొన్ని సేవలు ప్రారంభించేలా చూస్తున్నాం. నవంబరు వరకు భవనం మొత్తం పూర్తి చేసి జనవరి నాటికి పేదలకు అంకితం చేస్తాం’’ అని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

కరెంటుపై ఎద్దేవా చేసిన నల్లారి చీకట్లోకి

సిద్దిపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బల్లగుద్ది చాటాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. భారాస నేతలు నిజాలను ప్రస్తావించకపోతే ప్రతిపక్షాలు చెప్పే అవాస్తవాలను నమ్మే ప్రమాదం ఉంటుందన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో చీకటి మిగులుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారన్నారు. నేడు ఆయనకే చీకటి మిగిలిందని, తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవుతోందని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను ప్రదర్శించాలని సూచించారు.


ఏప్రిల్‌లో 69 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే: ట్విటర్‌లో హరీశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఏప్రిల్‌ నెలలో మొత్తం ప్రసవాల్లో 69 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగడం ద్వారా దేశంలో చరిత్ర సృష్టించినట్లు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలంటూ అభినందించారు. సంగారెడ్డి, నారాయణపేట, మెదక్‌, జోగులాంబ-గద్వాల జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగ్గా 16 జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో  70 శాతనికి పైగా జరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 30 శాతం ఉండగా 2022-23లో ఇవి 62 శాతానికి పెరిగాయని, మాతా, శిశు సంరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమన్నారు. ఏప్రిల్‌లో రాష్ట్రంలో 29,234 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగ్గా 13,428 ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగినట్లు వివరించారు. 87 శాతం ప్రసవాలతో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా 83 శాతంతో నారాయణపేట జిల్లా రెండో స్థానంలో, 48 శాతంతో రంగారెడ్డి జిల్లా చిట్టచివరన ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని