విశాఖలో భూకబ్జాలపై తెదేపా ఛార్జిషీట్‌

విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలపై ‘ఛార్జిషీట్‌’ ప్రకటించాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు.

Published : 01 Jun 2023 04:52 IST

రూపొందించాలని నేతలకు చంద్రబాబు సూచన

ఈనాడు- విశాఖపట్నం, న్యూస్‌టుడే- వన్‌టౌన్‌: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలపై ‘ఛార్జిషీట్‌’ ప్రకటించాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. బుధవారం విశాఖ వచ్చిన ఆయనను విమానాశ్రయంలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల తెదేపా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, డి.రామారావు, పలువురు పార్టీ నేతలు కలిశారు. కొందరు అచ్యుతాపురం, నగరంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయనతో పాటు కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా విశాఖలోని విలువైన భూములు కబ్జాకు గురవడంపై ప్రజలకు వివరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ, ఏ విధంగా అక్రమాలు జరిగాయో తెలిసేలా ఛార్జిషీట్‌ పేరుతో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ‘ప్రశాంత నగరంలో అలజడులు సృష్టించి, ప్రజలను భయాందోళనలకు గురిచేసి విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.వేల కోట్ల భూములు చేతులు మారాయి. ముఖ్యమైన భూ కబ్జాల్లో ఎవరెవరి హస్తం ఉంది. అందులో వైకాపా కీలక నేతల పాత్ర ఏమిటి? ఎలా వారి సొంతం చేసుకున్నారో తెలియజేసేలా వివరాలు ఉండాలి’ అని దిశానిర్దేశం తెలిసింది. విమానాశ్రయం నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా మధ్యలో మెడ్‌టెక్‌ జోన్‌ ప్రాంతాన్ని చూసి ‘మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ప్రగతి లేకుండా చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు