మోదీ అజేయశక్తి కాదు

భారత్‌లో ఈ ఏడాది జరగబోయే 3-4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను తాము చిత్తు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Published : 03 Jun 2023 06:10 IST

వచ్చే 3-4 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను చిత్తు చేస్తాం
అందుకు కావాల్సినవన్నీ కాంగ్రెస్‌కు ఉన్నాయ్‌
అమెరికా పర్యటనలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: భారత్‌లో ఈ ఏడాది జరగబోయే 3-4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను తాము చిత్తు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అందుకు అవసరమైన ప్రాథమిక వనరులన్నీ తమ పార్టీకి ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మోదీ అజేయశక్తేమీ కాదని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ వాషింగ్టన్‌లో గురువారం ప్రముఖ భారతీయ అమెరికన్‌ ఫ్రాంక్‌ ఇస్లాం ఆతిథ్యమిచ్చిన ఓ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఆరెస్సెస్‌, భాజపాలను నిలువరించడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. భారత్‌లో తదుపరి జరిగే 3-4 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కాంగ్రెస్‌ కర్ణాటక ఎన్నికల తరహాలోనే చిత్తు చేయబోతోంది. కమలదళానికి ప్రజల మద్దతు లేదు. కానీ మీడియాను గుప్పిట్లో పెట్టుకొని.. తమకు ప్రజాబలం ఉందని ఆ పార్టీ గొప్పలు చెప్పుకొంటోంది’’ అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరంల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి గమనార్హం.

ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావాలి

భారత్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని రాహుల్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో నేషనల్‌ ప్రెస్‌క్లబ్‌ (ఎన్‌పీసీ) వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విపక్షాల మధ్య ఐక్యత క్రమంగా మరింత పెరుగుతోంది. అన్ని ప్రతిపక్ష పార్టీలతో మేం మాట్లాడుతున్నాం. కొన్నిచోట్ల ఆయా పార్టీలతో మాకు పోటీ ఉంది. కాబట్టి చర్చలు కొంత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటే అంతా సవ్యంగా సాగుతుంది’’ అని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని వ్యాఖ్యానించారు.

మోదీకి ప్రజాదరణ.. నేను నమ్మను

ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రజాదరణ లభిస్తోంది కదా అంటూ ఎదురైన ఓ ప్రశ్నకు రాహుల్‌ స్పందిస్తూ.. ‘‘దేశంలో వ్యవస్థలన్నింటినీ వారు తమ అధీనంలోకి తీసుకున్నారు. మీడియానూ అంతే. మోదీకి విశేషాదరణ ఉందంటూ వస్తున్న వార్తలను నేను విశ్వసించను. ఎన్నికల్లో మోదీని ఓడించడం అసాధ్యమని మీడియా చెబుతోంది. అదంతా అతిశయోక్తి. నిజానికి ఆయనకు చాలా బలహీనతలున్నాయి. దేశంలో నిరుద్యోగిత, అధిక ధరల వంటివన్నీ ప్రజలను బాగా ఇబ్బందిపెడుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

ప్రధాని రక్షణలో బ్రిజ్‌భూషణ్‌: రాహుల్‌

దేశంలో రెజ్లర్ల ప్రస్తుత దుస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘‘దేశానికి 25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిన కుమార్తెలు న్యాయం కోసం వీధుల్లో పోరాడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ (బ్రిజ్‌భూషణ్‌) మాత్రం ప్రధాని రక్షణ కవచంలో సురక్షితంగా ఉన్నారు’’ అని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.

భాజపా, కాంగ్రెస్‌ మాటల యుద్ధం

ఐయూఎంఎల్‌ లౌకిక పార్టీయేనంటూ రాహుల్‌ వ్యాఖ్యానించడంపై భాజపా మండిపడింది. దేశ విభజనకు కారణమైన మహమ్మద్‌ అలీ జిన్నాకు చెందిన ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌ తరహా ఆలోచనాధోరణి ఉన్న నాయకత్వమే ఆ పార్టీని నడిపిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ ప్రతిస్పందిస్తూ- జిన్నా పార్టీతో పోలిస్తే ఐయూఎంఎల్‌ వేరని పేర్కొంది. జిన్నాపై భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ 2005లో ప్రశంసలు గుప్పించారని గుర్తుచేసింది. మహాత్మాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించిన సమయంలో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బెంగాల్‌ ప్రభుత్వంలో ముస్లిం లీగ్‌తో కలిసి ఉన్నారని, బెంగాల్‌ విభజనకు శ్యామాప్రసాదే ఏకైక కారణమని కూడా పేర్కొంది. తమ పార్టీపై రాహుల్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ఐయూఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి పి.కె.కునహలికుట్టి తెలిపారు. కాంగ్రెస్‌కు ఎదురైన అనుభవాల ఆధారంగా ఆయన ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

రాహుల్‌ వ్యాఖ్యలు చేదు వాస్తవాలు: మాయావతి

భారత్‌లో కోట్ల మంది దళితులు, ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందంటూ అమెరికా పర్యటనలో రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చేదు వాస్తవాలని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి అన్నారు. ఈ దుస్థితికి కాంగ్రెస్‌, భాజపాల నేతృత్వంలోని గత ప్రభుత్వాలే కారణమని ట్విటర్‌ వేదికగా శుక్రవారం విమర్శలు గుప్పించారు.


ముస్లిం లీగ్‌.. లౌకిక పార్టీయే

కేరళలో ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌)తో కాంగ్రెస్‌ జట్టు కట్టడాన్ని రాహుల్‌ సమర్థించుకున్నారు. అది పూర్తిగా లౌకిక పార్టీయేనని అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం.. అంతర్జాతీయంగా ప్రజలందరికీ ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రజాస్వామ్యం కూలిపోతే.. ప్రపంచమంతటా ప్రతికూల ప్రభావం ఉంటుందని, అమెరికా ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. దానికోసం తాము చిత్తశుద్ధితో పోరాడతామన్నారు. భారత్‌లో మైనార్టీల హక్కుల పరిరక్షణకు బలమైన వ్యవస్థ ఉందని, ఇటీవల దాన్ని కొంత నిర్వీర్యం చేశారని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తామని చెప్పారు. భారత భూభాగాలను చైనా ఆక్రమిస్తోందన్న తన వాదనను రాహుల్‌ పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఆ దేశం దాదాపుగా దిల్లీ పరిమాణమంతటి భారత భూభాగాన్ని ఆక్రమించిందని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా బంధం కేవలం రక్షణ సంబంధాలకు పరిమితం కాకుండా, ఇతర రంగాల్లోనూ విస్తృతమవ్వాలని ఆకాంక్షించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు