Balineni Srinivasa Reddy: ‘తెదేపా అధికారంలోకొస్తే మన పరిస్థితేంటి!’

‘వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి తెదేపా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 07 Oct 2023 08:42 IST

వాలంటీర్లు వైకాపా వాళ్లే.. కలుపుకొని వెళ్లండి
పార్టీ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని

ఈనాడు, ఒంగోలు: ‘వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోయి తెదేపా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి.. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏపీకి జగన్‌ ఎందుకు కావాలి’ అనే అంశంపై వైకాపా జిల్లా స్థాయి సమావేశం ఒంగోలులో శుక్రవారం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఏపీకి జగన్‌ ఎందుకు కావాలంటూ కొన్ని అంశాలపై తొలుత జగనన్న సురక్ష రాష్ట్ర కన్వీనర్‌ శివ శంకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే వైకాపా నాయకుల తాట తీస్తామంటూ జనసేన, తెదేపా నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. తెదేపా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే బాధ ఉందని, అయినా అలాంటి అసంతృప్తులు, నాయకుల మధ్య విభేదాలుంటే పరిష్కరించుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా గెలిపించుకుందామని ఉద్బోధించారు. తొంభై శాతం వాలంటీర్లు వైకాపా మద్దతుదారులేనని, ఎన్నికల సమయంలో నాయకులు వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాలంటీర్లను కచ్చితంగా మారుస్తామని చెప్పారు. జగన్‌ను జైల్లో పెడితే న్యాయస్థానాన్ని గౌరవిస్తూ వైకాపా వారెవరూ రోడ్డెక్కలేదని, ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెడితే న్యాయస్థానాన్ని కూడా తప్పుపట్టేలా తెదేపా శ్రేణులు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని