Botsa Satyanarayana: వైకాపాలో ఏదీ శాశ్వతం కాదు

వైకాపాలో ఏదీ శాశ్వతం కాదని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్నదే సీఎం ఆలోచన అని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపా గెలుపే ప్రాతిపదికన 11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చినట్లు తెలిపారు.

Updated : 12 Dec 2023 09:02 IST

గెలుపే ప్రాతిపదికన 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జుల మార్పు
ఎమ్మెల్యే ఆర్కే సేవలనూ వినియోగించుకుంటాం
మంత్రి బొత్స స్పష్టీకరణ
భవిష్యత్తులో ఇంకా మార్పులు ఉంటాయన్న సజ్జల

ఈనాడు, అమరావతి: వైకాపాలో ఏదీ శాశ్వతం కాదని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్నదే సీఎం ఆలోచన అని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వెల్లడించారు. రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపా గెలుపే ప్రాతిపదికన 11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చినట్లు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కొత్తగా నియమితులైన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు మంగళవారం నుంచి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. నియోజకవర్గాల మార్పులకు కారణం పాత స్థానాల్లో అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని కాదు.. కొత్తవాటిలో గెలుస్తారని మార్పు చేశాం. పార్టీ అంటే ఎమ్మెల్యేనే కాదు.. కార్యకర్తలూ ముఖ్యమే. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీకి ఎంత ప్రాధాన్యం ఇస్తామో పార్టీ కార్యకర్తలకూ అంతే ఉంటుంది.

ఇప్పటి వరకు పార్టీ ఇన్‌ఛార్జ్జులుగా ఉన్న వారి సేవలను సైతం వినియోగించుకుంటాం. మంగళగిరి సమన్వయకర్త గంజి చిరంజీవిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే పార్టీలో చేర్చారు. ఆయనే ఆప్కో ఛైర్మన్‌ ఇచ్చేందుకు సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుంది. ఏ ఒక్కర్నీ వదులుకోదు’ అని వెల్లడించారు. భవిష్యత్తులోనూ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పులు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘ప్రతి సమావేశంలో సర్వేల ఆధారంగా సీఎం జగన్‌ బహిరంగంగానే చెబుతున్నారు. సర్వేలు, సమీక్షల ఆధారంగానే సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైకాపా అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు అచితూచి అడుగులు వేస్తోంది’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని