AP BJP: తెదేపాతో పొత్తు మేలేమో!

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెదేపాతో పొత్తు మేలని భాజపా రాష్ట్రనేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Updated : 05 Jan 2024 12:44 IST

అభిప్రాయాన్ని తెలియజేసిన కొందరు భాజపా నేతలు
త్వరగా స్పష్టత ఇవ్వాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి
దిల్లీ పెద్దలకు తెలియజేయనున్న పురందేశ్వరి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెదేపాతో పొత్తు మేలని భాజపా రాష్ట్రనేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేసినట్లు సమాచారం. వీరి అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి సీల్డ్‌కవర్‌ ద్వారా దిల్లీలోని పార్టీ పెద్దలకు అందజేయనున్నారు. విజయవాడలో భాజపా సీనియర్‌ నేతలు గురువారం సమావేశమై.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జాతీయ నాయకుడు శివప్రకాష్‌, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నేతృత్వంలో బుధవారం జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో 40మంది నేతలు పాల్గొన్నారు. ఎన్నికల తరుణంలో పొత్తులపై స్పష్టత రావాలని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. వైకాపాపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్న కొందరు నేతలు.. తెదేపాతో పొత్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు.. ఈ సమావేశంలో మాట్లాడిన నేతలు ‘వైకాపాపై ఉన్న వ్యతిరేకత తెదేపాకు సానుకూలంగా మారుతోంది. వైకాపా పాలనలోని అక్రమాలపై కేంద్రం గట్టి సమాధానం ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. తొలినుంచీ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నవారికి పోటీచేసే అవకాశం కల్పించాలని ఒకరు కోరారు.

పొత్తు కోరుకుంటున్నట్లు తెదేపాతో పవన్‌ చెప్పించాల్సింది: సత్యకుమార్‌

‘‘ఈ సమావేశంలో పొత్తులపై చర్చించాం. ఇది మేం ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదు. మాతో పొత్తు పెట్టుకోవాలనుకునేవారు కూడా స్పందించాలి కదా! రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉంది. తెదేపాతో పొత్తులో కలిసిరావాలని జనసేన అధినేత పవన్‌ చెబితే సరిపోతుందా? విశాఖలో జరిగిన యువగళం వేదిక మీదే భాజపాతో పొత్తు కోరుకుంటున్నామని పవన్‌ తెదేపాతో చెప్పించాల్సింది. పొత్తు కోరేవారు ముందుకొస్తే సమస్య పరిష్కారం అవుతుంది. రాష్ట్రంలో భాజపాపై పెరుగుతున్న అసత్యప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించాం. అవినీతిపరులను, కుంభకోణాల్లో ప్రమేయం ఉన్నవారిని, మహిళలపట్ల వెకిలిగా వ్యవహరించే వారిని పార్టీలోకి తీసుకోం. రాష్ట్రశాఖ తరఫున చేరికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలను ఏర్పాటుచేస్తాం’’ అని సత్యకుమార్‌ తెలిపారు. మణిపుర్‌ ఘటనపై షర్మిల వ్యాఖ్యలను సత్యకుమార్‌ తప్పుబట్టారు. రాష్ట్రంలో వైకాపా, భాజపా ఒకటే అన్న భావనను సాధ్యమైనంత త్వరగా పోగొట్టాలని అధిష్ఠానానికి ఓ నేత స్పష్టంచేశారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు.

అధిష్ఠానమే నిర్ణయిస్తుంది: పురందేశ్వరి

‘పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించాం. పొత్తులపై నేతల అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలియజేస్తాను. రాష్ట్రస్థాయిలో నిర్ణయాలు ఉండవు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు?’ అని విలేకర్లతో అన్నారు.

శివప్రకాష్‌, పురందేశ్వరితో మనోహర్‌ భేటీ

భాజపా అగ్రనేతలతో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. కోర్‌కమిటీ సమావేశం ముగిసిన తర్వాత శివప్రకాష్‌, పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మనోహర్‌ కలిశారు. మర్యాదపూర్వకంగా శివప్రకాష్‌ను కలిసేందుకు మనోహర్‌ వచ్చారని పురందేశ్వరి చెప్పారు. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని