Revanth Reddy: నీటి పాపాలు కేసీఆర్‌వే

2022 మే 27న జరిగిన 16వ కృష్ణాబోర్డు సమావేశం ఎజెండాలోని 16.7వ అంశం కింద ప్రాజెక్టు కాంపొనెంట్‌లను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణాబోర్డు సమావేశంలోనూ ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు.

Updated : 05 Feb 2024 06:57 IST

ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం
జలాలపై హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు
కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది భారాసనే
మేం ఒప్పుకోకున్నా మాపై అభాండాలు వేస్తున్నారు
జగన్‌ జలదోపిడీకి కేసీఆర్‌ సహకారం
అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం
చర్చకు రండి.. ద్రోహం ఎవరిదో అక్కడే తేల్చుదాం
కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌
ఈనాడు - హైదరాబాద్‌

2022 మే 27న జరిగిన 16వ కృష్ణాబోర్డు సమావేశం ఎజెండాలోని 16.7వ అంశం కింద ప్రాజెక్టు కాంపొనెంట్‌లను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణాబోర్డు సమావేశంలోనూ ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ కాంపొనెంట్లతోపాటు గోదావరి బేసిన్‌లో పెద్దవాగును అప్పగించడానికి అంగీకరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. సీడ్‌మనీ కింద ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ మొత్తం వ్యవహారంలో మామాఅల్లుళ్లు కేసీఆర్‌, హరీశ్‌రావు ఉన్నారు.

రేవంత్‌రెడ్డి

‘కేసీఆర్‌ పాలించిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆయన సర్కారు పూర్తిగా లొంగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌ 512, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునేలా 2015లోనే కేంద్రం వద్ద కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటిహక్కులను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిన ఘనుడు కేసీఆర్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని తీసుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతిభవన్‌లోనే అంగీకారం కుదిరిందని, జగన్‌ జలదోపిడీకి కారణం కేసీఆర్‌ అని ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని భారాస ఆరోపణలు చేసిన నేపథ్యంలో నీటిపారుదల, అటవీశాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీనం చేసే విషయంలో కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తాము చేసిన పాపాలను కప్పిపుచ్చుకుని.. వాటిని కాంగ్రెస్‌పై నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం విధి విధానాలను కేంద్రం రూపొందించాల్సి ఉంది. ప్రతి అంశం తనను అడిగే చేశారని, ఈ చట్టానికి తానే రూపకల్పన చేశానని కేసీఆర్‌ గతంలోనే చెప్పారు. 2014లోనే దీనికి పునాదిరాయి పడింది. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగినపుడు కేసీఆర్‌ తన పార్టీ తెరాసకు లోక్‌సభాపక్ష నేతగా, కేశవరావు రాజ్యసభాపక్ష నేతగా ఉన్నారు. చట్టంలో ఇలా రావడానికి కేసీఆరే కారణం.

2015 జూన్‌ 18, 19 తేదీల్లో కేంద్ర జలవనరుల శాఖ వద్ద చర్చలు జరిగిన తర్వాత ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునకు అంగీకరించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తదితరుల నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆ సమావేశ మినిట్స్‌పై సంతకాలు చేశారు. ఆ రోజు 50 శాతం కావాలని అడగకపోగా, ఈ రోజు సగం నీళ్లు రావాలంటున్నారు. తొలుత ఒక్క సంవత్సరానికే అని చెప్పి.. 2019 వరకు ఏటా 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు ఇచ్చేలా కొనసాగించారు. 2019 తర్వాత.. బచావత్‌ ట్రైబ్యునల్‌ నీటి వాటాలు తేలేవరకు ఇలాగే కొనసాగిద్దామని ముక్తాయించారు.

కేసీఆర్‌, జగన్‌ చర్చించాకే రాయలసీమ ఎత్తిపోతల

ప్రగతి భవన్‌ వేదికగానే రాయలసీమ ఎత్తిపోతలకు కుట్ర జరిగింది. 2020 జనవరి 14న ప్రగతిభవన్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ కలిసి ఆరుగంటల పాటు సమీక్షించారు. రాయలసీమ ఎత్తిపోతల నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించుకునిపోయేలా అనుమతించారు. శ్రీశైలం కనీస మట్టం 834 అడుగులైతే, 797 అడుగుల మట్టం నుంచి అంటే బురద నీటిని కూడా తీసుకెళ్లేలా 2020 మే నెల 5న ఎత్తిపోతల పథకాన్ని జీవో 203తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ అధీనంలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును.. ఏపీ సీఎం జగన్‌ తమ సాయుధ పోలీసులను పంపి ఆక్రమిస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. దమ్ముంటే ఇప్పుడు ఆక్రమించడానికి ప్రయత్నించు జగన్‌రెడ్డీ.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడును 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినపుడు కేసీఆర్‌ కేంద్ర మంత్రి, హరీశ్‌రావు రాష్ట్ర మంత్రి అయితే, నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 800 అడుగుల మట్టం నుంచి అర టీఎంసీ నీటిని మళ్లించేలా ముచ్చుమర్రి పథకం చేపట్టారు. అప్పుడూ ఇక్కడ సీఎంగా కేసీఆర్‌, సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారు.

‘రాయలసీమ’ టెండర్‌కు ఆటంకం లేకుండా..

2020 ఆగస్టు 5న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. దీని ఎజెండాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది. కానీ 20వ తేదీ వరకు బిజీగా ఉన్నామని, తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తే వస్తామని నీటిపారుదలశాఖ కార్యదర్శితో కేసీఆర్‌ లేఖ రాయించారు. దీనికి కారణం పదో తేదీన రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ ఉండడమే. దాన్ని మేఘా కృష్ణారెడ్డికి అప్పగించడానికి ఆటంకం కలగకూడదనే ఆ సమావేశానికి రాలేమని చెప్పించారు. అయిదో తేదీన బోర్డు సమావేశానికి హాజరై గట్టిగా పట్టుబడితే రాయలసీమ టెండర్‌ వాయిదా పడేది.

అసెంబ్లీలో 48 గంటలు చర్చిద్దాం రండి

సాగునీటి రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడతాం. దీనిపై 48 గంటలు చర్చిస్తాం. చర్చకు రమ్మని కేసీఆర్‌కు సవాల్‌ విసురుతున్నా. కేటీఆర్‌, హరీశ్‌రావు కూడా చర్చలో పాల్గొనవచ్చు. కవిత కూడా మాట్లాడతానంటే ఉభయసభల సమావేశం ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌ మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్‌ కట్‌ చేయం. ఎవరు తెలంగాణకు ద్రోహం చేశారో తేలిపోతుంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసినా తెలంగాణ తీసుకోగలిగేది రోజుకు రెండు టీఎంసీలే. అదే ఆంధ్రా రోజుకు 12 నుంచి 13 టీఎంసీలు తీసుకుంటుంది. వారం రోజులు కళ్లు మూసుకుంటే శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు పోతాయి. తర్వాత బురదే మిగులుతుంది.

50 శాతం నీటి కోసం మేం ప్రయత్నిస్తున్నాం

నీటి వినియోగం ప్రస్తుతం 50 శాతం చొప్పున ఉండాలని కేంద్రానికి చెప్పాం. నికరజలాలు కేటాయించాక ఏ ప్రాజెక్టు నుంచి ఎంత అనే స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ను నేను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి ఇదే విషయం చెప్పాం. తెలంగాణ తరఫున గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసి, ఎనిమిదేళ్ల తర్వాత ఉపసంహరించుకుని.. రెండు రాష్ట్రాల మధ్య అంశంగా ట్రైబ్యునల్‌కు పంపింది. మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా ఇందులోకి తెమ్మని కోరాం. ఈ ప్రయత్నం చేస్తున్నాం.

త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

పెండింగ్‌ ప్రాజెక్టుల్లో చిన్నచిన్న పనులు చేస్తే.. త్వరగా పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కి.మీ. పూర్తయింది. పది కి.మీ. పెండింగ్‌లో ఉండగా.. గత పదేళ్లలో ఒక కి.మీ. మాత్రమే పూర్తి చేశారు. ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును 18 నెలల్లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. కల్వకుర్తి ఎత్తిపోతల కూడా ఇంతే. పాలమూరు- రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చుచేసినా ఎకరాకు కూడా నీరివ్వలేదు. కాళేశ్వరంపై విచారణకు న్యాయమూర్తిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. సమాధానం రాగానే చర్యలు తీసుకుంటాం. మేడిగడ్డ కుంగుబాటుపై సీడబ్ల్యూసీ, నేషనల్‌ డ్యాం సేఫ్టీ, అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేసి, వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.


ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోవడంలేదు

కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం ఉంటే, ఆంధ్రాలో 32 శాతం ఉంది. నీటి కేటాయింపులు దీనికి తగ్గట్లుగానే ఉండాలి. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశం మీటింగ్‌ మినిట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి మేం అంగీకరించామంటూ మినిట్స్‌లో పేర్కొనడం తప్పని, మేం ఒప్పుకోవడం లేదని స్పష్టంగా చెప్పాం. తెలంగాణ నీటి హక్కులను కొట్లాడి సాధించుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని