ఎవరు.. ఏ పార్టీకి ఓటేస్తారు?.. గుట్టుగా సర్వే చేయాలని సందేశాలు

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్లతో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అంశాలపై పలు నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారు.

Updated : 15 Mar 2024 07:08 IST

ఓటర్ల వివరాల సేకరణలో వాలంటీర్లు

సూళ్లూరుపేట, నాయుడుపేట, కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్లతో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అంశాలపై పలు నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు, వైకాపా ప్రచార కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేయించగా, తాజాగా మరో సర్వే చేయాలని బుధవారం రాత్రి అధికారుల నుంచి వాలంటీర్లకు సందేశాలు వచ్చాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ వాలంటీర్లకు సైతం ఇదే తరహా సందేశాలు వచ్చాయి. వాలంటీర్‌ క్లస్టర్‌ నంబరు.. పోలింగ్‌ బూత్‌ నంబరు.. క్లస్టర్‌లో ఓటర్లు ఎంతమంది.. వారిలో స్త్రీ, పురుషులు.. వైకాపా ఓటర్లు.. తటస్థంగా ఉండేవారు.. తెదేపా కూటమి ఓటర్లు ఎంత మంది? ఉన్నారో వెంటనే పంపించాలని సూచించారు. సందేశంలో ‘నోట్‌’ అని పెట్టి ఈ వివరాలు ఎవరితోనూ చెప్పొద్దనడం విశేషం. మరోవైపు ‘ప్రజా మద్దతు’ పేరుతో నాలుగు రోజులుగా సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో వాలంటీర్లు వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ‘జగనన్న ఆరోగ్య సురక్ష, నాడు-నేడు ద్వారా మీకు మంచి జరిగిందా.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మంచిదా.. ఈ ప్రభుత్వాన్ని కొనసాగిద్దామా.. మీరు మద్దతు తెలుపుతారా.. లేదా.. చెప్పండి’ అంటూ వేలిముద్రలు వేయించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని