ఖమ్మం, మెదక్‌, భువనగిరి టికెట్లకు పోటాపోటీ

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.

Updated : 19 Mar 2024 05:36 IST

లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాపై నేడు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ నిర్ణయం

ఈనాడు- హైదరాబాద్‌, దిల్లీ: రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. గత కొన్నిరోజులుగా పోటీలో ఉన్న అభ్యర్థుల బలాలు, సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సర్వేలను కూడా ఆధారం చేసుకొని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ముంబయిలో జరిగిన భారత న్యాయ జోడోయాత్ర ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా అక్కడే ఉన్నారు. ముంబయిలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు ఇతర సభ్యులు పాల్గొని అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. మంగళవారం కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ముంబయి నుంచి దిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల  కమిటీలో  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ్యునిగా ఉన్నారు. సీఈసీలో తుది జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం..

నియోజకవర్గాలపై మేధోమథనం

చేవెళ్ల లోక్‌సభ నుంచి సిటింగ్‌ ఎంపీ భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి పేరును సిఫార్సు చేశారు. వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌గా ఉంటూ భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన పట్నం సునీతారెడ్డిని మొదట చేవెళ్ల నుంచి పోటీకి దింపాలనుకొన్నా తాజాగా జరిగిన మార్పుల్లో ఈమెను మల్కాజిగిరికి ఖరారు చేసినట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు వంశీకృష్ణ బరిలో దిగనున్నారు. ఆదిలాబాద్‌కు వెడ్మబొజ్జు, డాక్టర్‌ సుమలత..; నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కరీంనగర్‌కు ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌రావు, నాగర్‌కర్నూల్‌కు మల్లు రవి, సంపత్‌కుమార్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్‌ లోక్‌సభకు కూడా ఒకే పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌కు వంశీచంద్‌రెడ్డి, నల్గొండకు రఘువీర్‌రెడ్డి, జహీరాబాద్‌కు సురేశ్‌ షెట్కర్‌, మహబూబాబాద్‌కు బలరాం నాయక్‌ల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించారు.

ఖమ్మం లోక్‌సభ స్థానానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రసాదరెడ్డి వైపే మొగ్గు కనిపిస్తున్నా, భట్టి కూడా గట్టిగా పట్టుబడుతుండటంతో.. దీనిపై సీఈసీలో చర్చించి అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే వీరిద్దరితో పాటు ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాలపై ప్రభావం చూపే అవకాశమున్న మాజీ ఎంపీ ఆర్‌.సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే తుది పోటీ ప్రసాదరెడ్డి, నందినిల మధ్యనే ఉంటుందని పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

భువనగిరి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. మొదటి నుంచి ఇక్కడ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉండగా, తన భార్య లక్ష్మికి ఈ స్థానంలో పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. గుత్తా అమిత్‌రెడ్డి కూడా రంగంలోకి వచ్చినా తొలినుంచి పార్టీలో ఉన్నవారి మధ్య పోటీ ఉండటంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఈ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన ఈయన సినీనటుడు అల్లు అర్జున్‌ మామ. ఈయన ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.

మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి విషయంలో కూడా పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు నీలం మధు ముదిరాజ్‌, మైనంపల్లి హనుమంతరావు తదితరుల పేర్లు వినిపించాయి. నీలం మధుకే అవకాశం ఉంటుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఓ పారిశ్రామికవేత్తతో పాటు, శేరిలింగంపల్లికి చెందిన రఘునాథ్‌ యాదవ్‌ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది.

సామాజిక సమీకరణాల్లో నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ స్థానాలపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ టికెట్‌ను మొదటి నుంచి మల్లు రవి కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ఈయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పదవి రాజీనామా లేఖను సీఎంకు ఇచ్చినట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్‌ నుంచి ఓడిపోయిన సంపత్‌కుమార్‌ కూడా ఈ సీటుకోసం పట్టుబడుతున్నారు. వరంగల్‌ లోక్‌సభకు దొమ్మాట సాంబయ్య, పసునూరి దయాకర్‌ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఎస్సీ సామాజికవర్గంలో ఒకరికి నాగర్‌కర్నూల్‌ ఇస్తే మరోవర్గానికి వరంగల్‌ కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందులో ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో ప్రకటించే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని