ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్‌

జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Published : 19 Mar 2024 04:54 IST

జలవనరుల రంగానికి తెదేపా హయాంలో చేసిన ఖర్చు రూ.68,293 కోట్లు
జగన్‌ అయిదేళ్ల పాలనలో చేసిన వ్యయం రూ.35,268 కోట్లే
మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

ఈనాడు, అమరావతి: జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని కేంద్ర తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో అయిదేళ్లలో రూ.68,293 కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 62 ప్రాజెక్టుల పనులను పరుగులెత్తించాం. ఏ ప్రాజెక్టులో ఏ స్థాయిలో పనులు అయ్యాయో పుస్తకం వేసి ప్రజలకు సమాచారం అందించాం. కానీ జగన్‌ వచ్చాక జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేశారు. రైతు కన్నీరు పెట్టకూడదని ప్రతి ఎకరానికీ నీళ్లందించేందుకు చంద్రబాబు కృషి చేశారు. జగన్‌రెడ్డి మూర్ఖత్వం, నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనమైంది. తెదేపా అధికారంలోకి రాక ముందు కాలువల మట్టి పనులకే పరిమితం చేశారు. 5 శాతం పనులూ పూర్తి కాలేదు. ఏడు ముంపు మండలాల నిర్వాసితుల డబ్బులు తినేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు రూ.115 కోట్ల పరిహారం చెల్లించి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ప్రాజెక్టు త్వరగా చేయడానికి చర్యలు తీసుకుంది. 72% పనులు పూర్తి చేశాం. దాదాపు రూ.11,923 కోట్లు ఖర్చు చేశాం. జగన్‌ అయిదేళ్ల పాలనలో రూ.5,825 కోట్లు పనులే చేశారు. డయాఫ్రం వాల్‌ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. మొదటి జలవనరులశాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ బుల్లెట్‌ దిగిందా అని అహంకారపూరితంగా మాట్లాడారు. రెండో మంత్రి పోలవరం అంటే చేతులెత్తేసి, డ్యాన్సులు చేస్తున్నారు. సీఎం జగన్‌, ఇద్దరు మంత్రులూ కలిసి పోలవరాన్ని ముంచేసి జాతికి ద్రోహం చేశారు’ అని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. ‘కరవు బారినపడే రాయలసీమను కాపాడాలని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ముచ్చుమర్రి, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల పనులు పరుగులెత్తించాం. వాటినీ జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారు. పక్క రాష్ట్రంలో తనకు సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో సీమకు వెళ్లాల్సిన నీటిని పొరుగు రాష్ట్రానికి ఇచ్చిన తెలివితక్కువ సీఎం జగన్‌రెడ్డి’ అని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని