కోడ్‌ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్‌

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్‌ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 19 Mar 2024 05:03 IST

మాజీ మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం

పొదలకూరు, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్‌ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని తెదేపా నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ దస్త్రాల ప్రకారం తవ్వకాలు జరిగే ప్రాంతం అటవీశాఖ భూమిగా ఉందని, సంబంధిత అధికారులేమో రెవెన్యూ భూమి అని చెబుతున్నారని తెలిపారు. భూమి ఎవరిదనేది తేలే లోపు అక్రమార్కులు రూ.400 కోట్ల విలువైన మైకాతో కూడిన క్వార్ట్జ్‌(తెల్లరాయి)ను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. జీపీఎస్‌ ఆధారిత ఫొటోలతో సహా కలెక్టర్‌కు పంపగా ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ఫిర్యాదును మైనింగ్‌ అధికారులకు పంపామని చెబుతున్నారు. సామాన్యుడు ఇంటి అవసరాలకు ట్రక్కుతో మట్టి తీసుకెళుతుంటే నాన్‌బెయిలబుల్‌ కేసు పెట్టి వెంటాడుతున్న పొదలకూరు సీఐకి ఈ దోపీడీ కనిపించలేదా?’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఈ మైనింగ్‌ దందాను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. తెదేపా నాయకులు పలువురు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని