సంక్షిప్త వార్తలు (11)

ఉత్తరాఖండ్‌ తరహాలో దేశమంతా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ మా మ్యానిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు.

Updated : 17 Apr 2024 06:24 IST

ఉమ్మడి పౌరస్మృతికి మోదీ గ్యారంటీ

ఉత్తరాఖండ్‌ తరహాలో దేశమంతా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ మా మ్యానిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు. మత ప్రాతిపదికన ఏ చట్టం ఉండకూడదని జనసంఘ్‌ ఆవిర్భావం నుంచి మా నేతలు చెబుతూ వస్తున్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారనేది అవాస్తవం. మేం రిజర్వేషన్లను ఉపసంహరించుకోం, ఎవరినీ అలా చేయనివ్వం.

ఉత్తరాఖండ్‌, జమ్మూ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


కుటుంబ పాలన, అవినీతి తప్ప డీఎంకే ఏమిచ్చింది?

కుటుంబపాలన, అవినీతి మినహా తమిళనాడుకు డీఎంకే పార్టీ ఏమిచ్చింది? అవినీతిరహితంగా అభివృద్ధికారక పాలన అందించడం ఆ పార్టీకి చేతకాదు. కేంద్రంలో అధికారం పొందడమే డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల లక్ష్యం. మాకు దేశమే ప్రాధాన్యం, వాటికి తమ కుటుంబాలే కీలకం. పేదలకు సేవచేసిన జయలలిత అంటే నాకు గౌరవం. కలహాలతో విపక్ష కూటమి ఎంతోకాలం మనజాలదు.

తమిళనాడులోని కృష్ణగిరిలో ఎన్నికల ప్రచారంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


రాజ్యాంగాన్ని మారిస్తే సామాన్యులే సమిధలు

అధికారం కోసం భాజపా ఏమైనా చేస్తుంది. ప్రజల్ని కొనేస్తుంది. ప్రభుత్వాలను పడగొట్టేస్తుంది. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తోంది. అది జరిగితే హక్కుల్లేక సమిధలయ్యేది సామాన్య ప్రజలే. రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వివేకంతో వాడుకోవాలి.

అస్సాంలోని జోర్హాట్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ 


అద్దంలో చూసుకోండి మోదీజీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ అవినీతికి పాల్పడిందని మమ్మల్ని అనే ముందు ప్రధాని మోదీ తనను తాను అద్దంలో చూసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన పార్టీ అంతా దోపిడీదారులతో నిండిపోయింది. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి భాజపా 300 కేంద్ర బృందాలను బెంగాల్‌కు పంపింది. వాటి దర్యాప్తుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భాజపా- బెంగాల్‌ వ్యతిరేక పార్టీ. అది మరోసారి అధికారంలోకి వస్తే ఇకపై ఎన్నికలు జరగవు.

జల్పాయిగుడి జిల్లాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ



పంజాబ్‌లో ఆప్‌ తుది జాబితా విడుదల

చండీగఢ్‌: పంజాబ్‌లో పోటీ చేసే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ఆప్‌ మంగళవారం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 13 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. తాజా జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలను ఆప్‌    లోక్‌సభ బరిలో దింపింది. ఆ ప్రకారం జలంధర్‌  (రిజర్వ్‌డ్‌) స్థానానికి మాజీ ఎమ్మెల్యే పవన్‌ కుమార్‌ టిను, ఫిరోజ్‌పుర్‌కు జగ్‌దీప్‌ సింగ్‌ కాక బ్రార్‌(ఎమ్మెల్యే), గురుదాస్‌పుర్‌కు అమన్‌షీర్‌ సింగ్‌ కల్సీ(ఎమ్మెల్యే), లుధియానాకు అశోక్‌ పరాశర్‌ పప్పీ(ఎమ్మెల్యే) పోటీలో నిలవనున్నారు. పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌తో కాంగ్రెస్‌, భాజపా, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు తలపడుతున్నాయి.


ఈసీ ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది?

ముఖ్యమంత్రులను జైళ్లకు పంపుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నా ఎన్నికల సంఘం ఎందుకో నిర్లిప్తంగా ఉండిపోయింది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మత రాజకీయాలను భాజపా ఆశ్రయిస్తోంది. నేను ఆంధ్ర, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించా. ప్రసార మాధ్యమాల్లో వస్తున్నదంతా తప్పే. పదేళ్ల భాజపా పాలనను ప్రజలు నిలదీస్తున్నారు. దేశమంతా మార్పు పవనాలు వీస్తున్నాయి.

కశ్మీర్‌లోని కఠువాలో ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌


భాజపాను గెలిపించేది కాంగ్రెస్సే

భాజపాతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంటుంది. పార్టీలో సంస్థాగత మార్పుకోసం గతంలో 23 మంది నేతలు పోరాడారు. కానీ, అగ్రనాయకత్వం వారి మాటలను వినిపించుకోలేదు. సమస్యలు లేవనెత్తినప్పుడు.. మేమంతా భాజపా భాష మాట్లాడుతున్నామని విమర్శించేది. కానీ ఆ పార్టీయే భాజపాను గెలిపించాలని కోరుకుంటున్నట్లు నాకు చాలాసార్లు అనిపించింది.

కశ్మీర్‌లో విలేకరులతో డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ అధినేత గులాంనబీ ఆజాద్‌


తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీల పెంపుతో ప్రజలపై పెనుభారం

వైకాపా సర్కారుపై భాజపా నేత లంకా దినకర్‌ ధ్వజం

 ఈనాడు డిజిటల్‌, అమరావతి: అయిదేళ్ల వైకాపా పాలనలో తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలను పెంచడంతో రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడిందని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ పేర్కొన్నారు. తన అసమర్థ పాలనతో సీఎం జగన్‌ సుమారు రూ.13.50 లక్షల కోట్ల మేర అప్పు చేశారని ఆరోపించారు. వైకాపా సర్కారు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిన రూ.7 లక్షల చొప్పున అప్పు వేసిందని మండిపడ్డారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘కుటుంబ అవసరాలకు తగ్గట్టు ఆదాయం లేక రూ.లక్షల్లో రుణాలు తీసుకుంటూ మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి వెళ్లిపోవడంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. వైకాపా విధ్వంసకర, అవినీతి, అరాచక పాలన నుంచి బయటపడకుంటే ప్రజల జీవితాలు అంధకారం అవుతాయి’ అని వివరించారు.


దళితులకు న్యాయం జరిగేలా చూడడంలో ప్రభుత్వం విఫలం: సీపీఎం

ఈనాడు, అమరావతి: శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు న్యాయస్థానం విధించిన శిక్షపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘సమాజం తలదించుకునేలా జరిగిన అనాగరికమైన దాడిపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులోనే తీర్పు వచ్చేందుకు 28 ఏళ్లు పట్టిందంటే.. దళితుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తీర్పు ఆలస్యమైనా పూర్తిస్థాయి న్యాయం జరగకపోవడం విచారకరం’’ అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఈ కేసులో దళితులకు న్యాయం జరిగేలా చూడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్లి ఇప్పటికైనా కఠిన శిక్ష పడేలా చూడాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దళితులపై జరిగే అకృత్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని హత్య చేసి, ఈ రోజు దర్జాగా బెయిల్‌పై తిరగడమే కాకుండా ఎన్నికల్లో ప్రత్యర్థులను బెదిరించడం, అక్రమాలు చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం చూస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


వైకాపాకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోండి

సీఈఓకి ఫిర్యాదు చేసిన బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఎన్నికల ఉల్లంఘనలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నగరంలోని 63, 64వ డివిజన్ల కార్పొరేటర్లు సోమవారం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారని పేర్కొన్నారు. దీనిపై నున్న సీఐకి, నార్త్‌ ఏసీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సచివాలయంలో సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన అధికారులు, పోలీసులను వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు.


త్రిమూర్తులును ఎన్నికల బరిలో నుంచి తప్పించండి

బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శిరోముండనం కేసులో దోషిగా తేలిన తోట త్రిమూర్తులును ఎన్నికల బరిలో నుంచి తప్పించాలని బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య సీఎం జగన్‌ను డిమాండ్‌ చేశారు. ఆయన్ను పోటీలో నుంచి తప్పించకుంటే వైకాపాకు దళితులు ఓట్లు వేయరని మంగళవారం రాసిన లేఖలో హెచ్చరించారు. ‘శిరోముండనం కేసులో అంతిమంగా దళితుల ఆత్మగౌరవమే గెలిచింది. కేసులో నుంచి బయటపడేందుకు త్రిమూర్తులు బాధితులను ప్రలోభపెట్టారు. వారు ఎస్సీలు కాదని నిరూపించే ప్రయత్నాలు చేశారు. బాధితులను భయపెట్టారు. గతంలో.. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న తోటకు ఎమ్మెల్సీ ఇవ్వొద్దని కోరినా జగన్‌ పట్టించుకోలేదు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరికి న్యాయమే గెలిచింది’ అని బాలకోటయ్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని