నామినేషన్లకు వేళాయె..

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Published : 18 Apr 2024 03:13 IST

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గురువారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం మాత్రం స్వీకరించరు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు 645 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. తుది పోరులో 443 మంది నిలిచారు.

30న తుది ఓటర్ల జాబితా

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో నాలుగో దశలో పోలింగ్‌ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అందిన దరఖాస్తుల్లో అర్హులకు ఈ నెల 30వ తేదీలోగా ఓటుహక్కు కల్పించనున్నారు. అదేరోజు రూపొందించిన ఓటర్ల జాబితానే పోలింగ్‌కు ప్రామాణికంగా తీసుకుంటారు.

భారీ బందోబస్తు..

ఎన్నికల సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న నేపథ్యంలో నిఘాను విస్తృతం చేశారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 60 వేల మంది సిబ్బందిని వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. సుమారు 75 నుంచి 100 కంపెనీల వరకు కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రానికి పంపేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, లోక్‌సభ ఎన్నికలనూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు బుధవారం ‘ఈనాడు’కు తెలిపారు.


35,666 పోలింగ్‌ కేంద్రాలు

రాష్ట్రంలో 35,666 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనంగా సహాయక పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సైతం ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు విస్తృత నిఘా పెట్టింది. ఇప్పటివరకు సుమారు రూ.130 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఎన్నికల పర్యవేక్షణకు వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది సీనియర్‌ అధికారులను పరిశీలకులుగా ఈసీ నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని