తొలి విడతలో కీలకం!

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందులో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

Updated : 18 Apr 2024 06:13 IST

కమల్‌నాథ్‌కు చావో రేవో..
భాజపాకు చంద్రపుర్‌ పరీక్ష
ఆజంఖాన్‌ లేని రాంపుర్‌
ముజఫర్‌నగర్‌ ప్రతిష్ఠాత్మకం

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందులో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వాటిలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపుర్‌, ముజఫర్‌నగర్‌, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా, మహారాష్ట్రలోని చంద్రపుర్‌ ఉన్నాయి.


కుమారుడి కోసం..

మధ్యప్రదేశ్‌లో అందరి దృష్టి కేంద్రీకృతమైన నియోజకవర్గం ఛింద్వాడా. కాంగ్రెస్‌ దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన కుమారుడు నకుల్‌నాథ్‌ను ఇక్కడ రెండోసారి బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో ఆయన గెలిచారు. మధ్యప్రదేశ్‌లో భాజపా ఓడిపోయిన సీటు ఇదొక్కటే. తాజాగా పార్టీ నేతలందరూ తనను వీడి వెళ్లిన సమయంలో కమల్‌నాథ్‌ కీలక పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు భాజపాలోని కీలక నేతలందరూ ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థి వివేక్‌ బంటీ సాహు తరఫున విస్తృత ప్రచారం చేశారు. గత 44 ఏళ్లలో భాజపా ఒక్కసారే ఛింద్వాడాలో గెలిచింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ఇటీవల 6సార్లు పర్యటించి ప్రచారం చేశారు. ఆయన స్థానిక, స్థానికేతర నినాదాన్ని లేవనెత్తారు. సాహు స్థానికుడని, కమల్‌నాథ్‌ కుటుంబం స్థానికేతరులని ప్రచారం చేశారు. ఇటు సానుభూతిపై కమల్‌నాథ్‌ ఆధారపడుతున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధినీ గుర్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి దాదాపు 5,000 మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భాజపాలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఛింద్వాడాలోని ఏడు సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. కమల్‌నాథ్‌ ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. నకుల్‌నాథ్‌ 2019లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 16.28లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 8.22 లక్షల మంది పురుషులు, 8.05లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 11 మంది ట్రాన్స్‌జెండర్లు.


తిరిగి సాధించాలని..

గత ఎన్నికల్లో... మహారాష్ట్రలోని 48 సీట్లలో కాంగ్రెస్‌ గెలిచిన ఒకే ఒక్క సీటు చంద్రపుర్‌. అయితే ఈసారి ఇక్కడ పోరాటం అంత సులభంగా లేదు. దీనిని తిరిగి సాధించడానికి భాజపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున ప్రతిభ ధనోర్కర్‌, భాజపా తరఫున రాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగంటీవార్‌ పోటీ చేస్తున్నారు. విదర్భ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉంది. గత ఏడాది మే నెలలో సిటింగ్‌ ఎంపీ సురేశ్‌ ధనోర్కర్‌ మరణించడంతో అప్పటి నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. ఆయన భార్యకే కాంగ్రెస్‌ టికెటిచ్చింది.

  • సానుభూతిపై ప్రతిభ ఆధారపడుతుండగా.. రాజకీయ ఉద్ధండుడిగా పేరున్న ముంగంటీవార్‌ అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు.
  • 2019 కంటే ముందు రెండుసార్లు ఈ సీటును భాజపా గెలుచుకుంది.
  • చంద్రపుర్‌ సీటును ఎలాగైనా తిరిగి గెలవాలని భావిస్తున్న భాజపా నాయకత్వం.. మహారాష్ట్రలో ప్రధాని మోదీ ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభింపజేసింది.
  • వాస్తవానికి చంద్రపుర్‌ కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ 11 సార్లు ఆ పార్టీ గెలిచింది. నాలుగు సార్లు భాజపా విజయం సాధించింది.
  •  గత మూడు దశాబ్దాలుగా ముంగంటీవార్‌ ఇక్కడ కీలక నేతగా ఉన్నారు. ఆయన అభ్యర్థి అనగానే విజయం నల్లేరుపై నడకేనని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందంటున్నారు. ప్రతిభ నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఇస్తున్నారు.
  •  ఈ నియోజకవర్గంలో కుల సమీకరణాలు ప్రభావం చూపుతాయి. 19లక్షల మంది ఓటర్లున్నారు. అందులో ప్రతిభ సామాజిక వర్గానికి చెందిన కుంబీలు 4.25 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది దళితులు, తేలీ వర్గానికి చెందినవారు లక్ష మంది, 60,000 మంది ముస్లింలు, 1.5 లక్షల మంది బంజారాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు.
  •  శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలు భాజపాతో పొత్తు పెట్టుకోవడంపట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
  •  చంద్రపుర్‌ జిల్లాలో ప్రస్తుతం మద్య నిషేధం అమల్లో ఉంది. ఇది ముంగంటీవార్‌ పోరాట ఫలితమే. అయితే అది కఠినంగా అమలు కాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. ఇది భాజపాకు వ్యతిరేకంగా మారింది.
  •  ప్రతిభ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తోందని ముంగంటీవార్‌ విమర్శించడాన్ని ప్రజలు అంగీకరించడం లేదు.

మత సామరస్యం, ధరలు, శాంతి భద్రతల సమస్య

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నియోజకవర్గంలో మత సామరస్యం, ధరలు, శాంతి భద్రతలే ప్రధాన సమస్యలు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ వేధింపులను సమస్యగా పేర్కొంటున్నారు. ముజఫర్‌నగర్‌లో రోడ్లు బాగాలేవు. పేదలకు కనీస సౌకర్యాలు లేవు. చదువులు, ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.


ఆజాంఖాన్‌ గైర్హాజరీలో..

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాంపుర్‌ తొలిసారిగా ఆజంఖాన్‌ లేకుండా ఎన్నికలకు వెళ్తోంది. గత ఐదు దశాబ్దాల్లో ఆయన లేకపోవడం ఇదే తొలిసారి. ఈ సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రాముఖ్యమున్న రాంపుర్‌లో నవాబ్‌లదే ఆధిపత్యం. 1978 నుంచి 2022 వరకూ ఆజంఖాన్‌ కుటుంబానికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఈసారి రాంపుర్‌లో పెద్దగా ఎన్నికల వాతావరణం లేదని స్థానికుడొకరు తెలిపారు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ ఇమాం మొహిబుల్లా నద్వీని రంగంలోకి దించింది. దీంతో ఆజంఖాన్‌ అనుయాయులు అంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు.

  •  ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇక్కడ సమస్యలు కావని, గతంలో మాదిరిగానే భావోద్వేగాలే ప్రభావం చూపుతున్నాయని స్థానికుడొకరు తెలిపారు.
  •  భాజపా తరఫున ఘన్‌శ్యామ్‌ సింగ్‌ లోధీ పోటీ చేస్తున్నారు. ఆయన సిటింగ్‌ ఎంపీ.
  •  బీఎస్పీ నుంచి జీషన్‌ ఖాన్‌ పోటీ చేస్తున్నారు.
  •  ఈ నియోజకవర్గంలో 17.31 లక్షల ఓట్లున్నాయి. అందులో 50.10శాతం మంది ముస్లింలు. 49.90శాతం మంది ముస్లిమేతరులు.
  •  హిందూ ఓటర్లలో 9శాతం దళితులున్నారు. లోధీలు 8శాతం ఉన్నారు.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని