సంక్షిప్త వార్తలు (11)

దేశంలోని అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తామని సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వెనకున్న ఉద్దేశమేమిటి?

Updated : 18 Apr 2024 06:49 IST

అణ్వాయుధాలపై కాంగ్రెస్‌ వైఖరేంటి?

దేశంలోని అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తామని సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వెనకున్న ఉద్దేశమేమిటి? దేశ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ సర్కారు ప్రారంభించినందువల్ల ఈ అంశంపై కాంగ్రెస్‌ కూడా వైఖరి స్పష్టంచేయాలి.

పాకిస్థాన్‌, చైనా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. మనకు అలాంటి ఆయుధాలు లేకుండా చేస్తే బలహీనపడతాం. కాంగ్రెస్‌, వామపక్షాలు అలాంటి కుట్ర పన్నుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినందుకే కాంగ్రెస్‌కు దేశంలో ఉనికి లేకుండా పోయింది.

కేరళలోని కాసర్‌గోడ్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


తన పేరుతోనే మోదీ రాజకీయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏనాడూ ఓట్లను భాజపాకు వేయాలని కోరలేదు. ఆయన తన పేరుతోనే రాజకీయం చేశారు. ఆయనకు పార్టీ అన్నా, కార్యకర్తలన్నా ఏమాత్రం గౌరవం లేదు. కాంగ్రెస్‌ సాధించే విజయాలన్నీ పార్టీ విజయాలుగానే చిత్రీకరిస్తున్నాం.

 కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే


మోదీ హామీలను ప్రజలు నమ్మరు

ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ప్రధాని మోదీ పెద్దఎత్తున హామీలు ఇస్తున్నా వారు వాటిని నమ్మరు. ఆరెస్సెస్‌ ఎజెండాను భాజపా అమలు చేస్తోంది. ప్రజల్ని ఒకసారి మోసగించగలరేమో గానీ పదేపదే మాత్రం కాదు. 2014లో యూపీయేపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పుడు మోదీ సర్కారు అనేక హామీలతో అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్‌ ఆర్థిక విధానాలనే కొనసాగించింది.

పాలక్కాడ్‌లో కేరళ సీఎం పినరయి విజయన్‌


భాజపా తుడిచిపెట్టుకుపోతుంది

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. అబద్ధాలకు మారుపేరైన భాజపా యూపీలో గాజియాబాద్‌ నుంచి గాజీపూర్‌ వరకు తుడిచిపెట్టుకుపోతుంది. రైతులు భాజపా తీరుతో విసిగిపోయారు. మార్పును కోరుకుంటున్న దేశ ప్రజల్లో ఇండియా కూటమి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నికల బాండ్లు భాజపా అవినీతిని బట్టబయలు చేశాయి.

లఖ్‌నవూలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌


నేడు లోకేశ్‌ తరఫున నామినేషన్‌ దాఖలు

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ తరఫున తెదేపా, జనసేన, భాజపా నాయకులు గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. పాత మంగళగిరి సీతారామ కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులతో భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుంటామన్నారు.


అనంతలో తెదేపా రోడ్‌ షోపై వైకాపా రాళ్ల దాడి

కుందుర్పి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని ఎనుములదొడ్డి గ్రామంలో బుధవారం రాత్రి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడికి తెగబడ్డాయి. ఒక రాయి అభ్యర్థి ఉన్న వాహనానికి తగలగా, మరోటి కార్యకర్తకు తగిలింది. తెదేపా శ్రేణులు అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గొడవ జరగకుండా చర్యలు చేపట్టారు. రోడ్‌ షోలో జనం భారీగా పాల్గొనడంతో జీర్ణించుకోలేని వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయని తెదేపా నాయకులు ఆరోపించారు.


సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం పెంచుతాం
ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఎన్డీయే నేతల హామీ

ఈనాడు, అమరావతి: కేంద్రం నుంచి స్థానిక సంస్థల అభివృద్ధికి వచ్చే నిధులు మళ్లించబోమని, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వబోతున్నట్లు ఎన్డీయే నేతలు ప్రకటించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో తెదేపా నేత, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఛైర్మన్‌ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోనా తాతారావు మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చిన రూ.8,629 కోట్లను సీఎం జగన్‌ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. వీటిని దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకొని, పార్టీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను దీనమైన స్థితికి తీసుకొచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.988 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. దీనిపై ఇప్పటికే ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు నివేదించాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. నిధుల మళ్లింపు తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.


పశ్చిమబెంగాల్లో కంటే ఏపీలోనే ఎన్డీయేకు ఎక్కువ స్థానాలు
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఈ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో కంటే ఏపీలోనే ఎన్డీయే అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించనున్నారని, అదే విషయాన్ని పలు సర్వేలు ధ్రువీకరిస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సూచించారు. భాజపా అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలిచేలా ప్రతి కార్యకర్త పని చేయాలని భాజపా ఏపీ ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్దార్థ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సూచించారు.


భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి
జనసేన అభ్యర్థులకు లోకేశ్‌ శుభాకాంక్షలు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నుంచి బీ ఫారాలు అందుకున్న ఆ పార్టీ అభ్యర్థులకు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అధర్మాన్ని అంతమొందించి.. గొప్ప విజయంతో ధర్మాన్ని స్థాపించే ఈ ప్రయత్నంలో భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’ అని ‘ఎక్స్‌’ వేదికగా లోకేశ్‌ అభిలషించారు.


వైకాపా తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
తెదేపా అధికార ప్రతినిధి రఫీ

‘ఎన్డీయే అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లు ఎత్తేస్తోందన్న వైకాపా తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. ఓటమి తప్పదనే సీఎం జగన్‌ కుట్రలకు తెర లేపారు. ఐదేళ్లుగా జగన్‌ అరాచకాలతో దివాలా తీసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబు సీఎం కావాలి. అందుకు ముస్లింలు ఎన్డీయేకు బాసటగా నిలవాల’ని రఫీ కోరారు.


నాలుగో జాబితా ప్రకటించిన లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు కలిపి మొత్తం నలుగురు అభ్యర్థులను లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే 30అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌.. తాజాగా నాలుగో జాబితాను ప్రకటించారు. మరికొంత మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో ప్రజలను ఎటువంటి ప్రలోభాలాకు గురిచేయకుండా నిజాయతీగా ముందుకెళ్తాం. రాజకీయాల్లో సమూల మార్పు తీసుకురావాలన్నదే మా లక్ష్యం. డబ్బే గెలుపోటములను నిర్ణయిస్తుందనే అపోహను తొలగించేలా నోట్ల కట్టలతో వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పాలి’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని