రాష్ట్ర అంశాలే ఎజెండా

రాజస్థాన్‌లో భాజపా హవాను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. క్లీన్‌స్వీప్‌ చేయకుండా కొన్ని సీట్లైనా దక్కించుకోవాలని పోరాడుతోంది.

Published : 18 Apr 2024 04:25 IST

రాజస్థాన్‌లో 100 రోజుల భాజపా పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్‌ ప్రచారం
జాతీయ మ్యానిఫెస్టోను పట్టించుకోని స్థానిక నాయకత్వం
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

రాజస్థాన్‌లో భాజపా హవాను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. క్లీన్‌స్వీప్‌ చేయకుండా కొన్ని సీట్లైనా దక్కించుకోవాలని పోరాడుతోంది. ఇందులో భాగంగా జాతీయ అంశాలను పక్కనబెట్టి స్థానిక ఎజెండానే ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. పంచ న్యాయాల పేరుతో 25 హామీలను మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చింది. ఇవి ఇప్పుడు రాజస్థాన్‌లో ప్రచారాస్త్రాలు కావు.

ఆర్థిక వ్యవస్థపై..

అధికారం చేపట్టగానే 100 రోజుల్లో తాను చేపట్టబోయే పనులపై ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ప్రకటన చేశారు. వాటిని అమలు చేయడంలో ఆయన విఫలమయ్యారు. ఆదాయ ఆర్జన శాఖల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూరుస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే లక్ష్యాల సాధనలో విఫలమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.1,22,103 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రూ.17,680 కోట్లు తక్కువగా రూ.1,04,423 కోట్లే వచ్చింది.


సంక్షేమ పథకాలపై..

భజన్‌ లాల్‌ శర్మ అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయడమో.. కుదించడమో జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ‘కొత్త ప్రభుత్వం ప్రజలకు అదనంగా ఏమీ ఇవ్వలేదు. పైగా ఆరోగ్య పథకం పేరును మార్చింది. 50,000 మంది నిరుద్యోగ యువతకు నెలనెలా రూ.5,000 ఇచ్చే పథకాన్ని రద్దు చేసింది. దీంతో యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు’ అని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు.


100 రోజుల్లో ఏం చేస్తామన్నారు..

భజన్‌ లాల్‌ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 100 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తానని ప్రకటించారు. అందులో వైద్య విద్య, కళలు, సంస్కృతి, ఆహారం-పౌర సరఫరాలు, వైద్య - ఆరోగ్యం, ఇంధన రంగాలపై ఆయన తన ప్రణాళికను వెల్లడించారు. వాటిలో 30 - 40శాతం   కూడా పూర్తి కాలేదు.


ఏం జరిగింది?

  •  వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, గనులు, పెట్రోలియం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. అవి ఆదాయ ఆర్జనలో వెనుకబడిపోయాయి.
  •  స్థానిక ప్రభుత్వాలు, క్రీడలు, యువజన వ్యవహారాలు, శిశు సంక్షేమం వంటి రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు కాలేదు.
  •  పరిశ్రమలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సంస్కృతం, ప్రజా సంబంధాలు, శాంతి భద్రతల వంటి అంశాల్లో 100 శాతం  ప్రణాళిక అమలైంది.
  •  భజన్‌ లాల్‌ శర్మ 730 అంశాలతో 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. వాటిలో 300 అంశాలనే పూర్తి చేయగలిగారు.

 కాంగ్రెస్‌ ఏమంటోంది?

భజన్‌ లాల్‌ శర్మ ప్రభుత్వం 100 రోజుల్లో అద్భుతాలు చేస్తామని డాంబికాలు పలికిందని, అవి నెరవేరలేదని ప్రతిపక్ష నేత టికారాం జూలీ విమర్శించారు. 100 రోజుల కార్యాచరణను అమలులో విఫలమైన ప్రభుత్వం రూ.100 కోట్లతో ప్రచార ప్రకటనలను మాత్రం ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఈ నిధులను ప్రధాని మోదీ గ్యారంటీల పేరుతో వృథా చేసిందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని