తెదేపా నేత ఇంటికెళ్లి సీఐడీ హంగామా

తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతిని ఉద్దేశించి ‘భారతీ పే’ అంటూ తప్పుడు వార్త సృష్టించి, దాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారంటూ విజయ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు శనివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-3లోని ఆయన నివాసానికి వెళ్లి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చారు.

Published : 02 Oct 2022 04:15 IST

6న విచారణకు రావాలంటూ చింతకాయల విజయ్‌కు 41ఎ నోటీసు

నన్ను కొట్టి, విజయ్‌ కుమార్తెను బెదిరించారు

పోలీసులకు ఆయన పీఏ ఫిర్యాదు

ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి, న్యూస్‌టుడే- బంజారాహిల్స్‌: తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతిని ఉద్దేశించి ‘భారతీ పే’ అంటూ తప్పుడు వార్త సృష్టించి, దాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారంటూ విజయ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు శనివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-3లోని ఆయన నివాసానికి వెళ్లి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చారు.

ఇంట్లో విజయ్‌ అందుబాటులో లేకపోవటంతో పనిమనిషికి నోటీసులు అందించారు. సీఐడీ పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి, తమను బెదిరించారని విజయ్‌ కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు తనను కొట్టి, విజయ్‌ కుమార్తెను బెదిరించారని ఆయన వ్యక్తిగత సహాయకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణకు హాజరుకాకుంటే అరెస్టు

మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని, రాకపోతే అరెస్టు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేటప్పుడు ఆయన వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్లూ తీసుకురావాలని ఆదేశించారు. ‘ఈ నెల 1న మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 14/2022 నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 419, 469, 153(ఏ), 505(2), 120(బీ) రెడ్‌విత్‌ 34తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66సీ కింద ఈ కేసు పెట్టాం. ఈ కేసులో వాస్తవాలు వెలికితీసేందుకు మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. కేసుకు సంబంధించిన ఆధారాలేవీ పాడు చేయకుండా, మీకు తెలిసిన విషయాలన్నీ దాచకుండా దర్యాప్తు అధికారి ఎదుట వెల్లడించాలి. విచారణకు సహకరించాలి’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

ముందు రోజే రెక్కీ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో విజయ్‌ నివసిస్తున్న ట్రెండ్‌ సెట్‌ విల్లాలో ఏపీ సీఐడీ అధికారుల తనిఖీలు గందరగోళం సృష్టించాయి. ఈ నెల 1న (శనివారం) కేసు నమోదు చేసినట్లు సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ.. శుక్రవారం ఉదయమే రెండు కార్లలో సుమారు 14 మంది బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 3 నుంచి విజయ్‌ నివాసం ఉన్న ప్రాంతానికి వచ్చారు. వాహనాలను దూరంగా నిలిపి పరిసర ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా 14-15 మంది ఇంట్లోకి ప్రవేశించటంతో విజయ్‌ కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సెల్లార్‌లో ఉన్న విజయ్‌ వ్యక్తిగత సహాయకుణ్ని బెదిరించారు. చెంప మీద కొట్టి తాము బ్యాంకు అధికారులమంటూ ఇంటి తలుపులు తెరిపించారు. పడకగది, వంటగది, అల్మరాల్లో తనిఖీలు చేశారని, ఇంట్లో పిల్లలు, మహిళలున్నా చూడకుండా హల్‌చల్‌ చేశారని, అసలు వచ్చింది పోలీసులా కాదా అనే విషయం తెలియడం లేదని విజయ్‌ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహించాలని ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. విషయం తెలియగానే తెదేపా పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు మంతెన వెంకట సత్యనారాయణరాజు, తెలంగాణ తెదేపా నేతలు శ్రీనివాసనాయుడు, తుళ్లూరి జీవన్‌, డాక్టర్‌ పొగాకు జయరాం, కార్యకర్తలు విజయ్‌ ఇంటికి చేరుకొని మద్దతుగా నిలిచారు. తాము ఎవరిపైనా దాడి చేయలేదని, న్యాయవాది సమక్షంలోనే నోటీసులు అందించామని ఏపీ సీఐడీ పోలీసులు మీడియాకు తెలిపారు.

స్టేషన్‌కు తీసుకెళ్లి కొడతామన్నారు: విజయ్‌ పీఏ

శనివారం మధ్యాహ్నం దాదాపు 14 మంది ఏపీ సీఐడీ పోలీసులమని చెప్పి వచ్చి విజయ్‌ ఉన్నారా అని అడిగారని, లేరని చెప్పడంతో తన సెల్‌ఫోన్‌ లాక్కొని చెంపపై కొట్టారని చింతకాయల విజయ్‌ వ్యక్తిగత సహాయకుడు విజయ్‌ చంద్రబాబు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొడతామని బెదిరించారు. మా సార్‌ అయిదేళ్ల కుమార్తెకు తండ్రి ఫోటో చూపుతూ.. ఇతను మీ నాన్నే కదా! ఎక్కడున్నాడు. ఎప్పుడొస్తాడంటూ బెదిరించారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ పోలీసులు సైతం బంజారాహిల్స్‌ పోలీసులను కలిసి.. చింతకాయల విజయ్‌ ఇంట్లో నోటీసులు అందించి వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు సాయంత్రం మరోసారి విజయ్‌ ఇంటికి వెళ్లి విల్లాలో ఏయే ప్రాంతాల్లో సీసీ కెమెరాలున్నాయని ఆరా తీశారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ కావాలంటూ హడావుడి చేశారని తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు డాక్టర్‌ పొగాకు జయరాం తెలిపారు.

ఐటీడీపీ పాత్ర ఉందని వెల్లడైంది: సీఐడీ

ముఖ్యమంత్రి జగన్‌ భార్య భారతి గురించి ఉద్దేశపూర్వకంగా ‘భారతీ పే’ అనే తప్పుడు వార్త సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని, ఈ వ్యవహారంలో ఐటీడీపీ పాత్ర ఉన్నట్లు వెల్లడైందని ఏపీ సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది. చింతకాయల విజయ్‌   ఆధ్వర్యంలో ఐటీడీపీ నడుస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో  ఆయనపై కేసు నమోదు చేసి, దర్యాప్తుకు సహకరించాలని నోటీసులిచ్చామని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని