చిన్న పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి: కనకమేడల

సభలో చిన్న పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ సూచించారు.

Updated : 08 Dec 2022 06:45 IST

ఈనాడు, దిల్లీ: సభలో చిన్న పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ సూచించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్‌ ధన్‌ఖడ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘కోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాదికి న్యాయమూర్తి అవకాశం ఇవ్వకుంటే ఆ కేసును ఆయన ఓడిపోతారనే విషయం న్యాయవాదిగా పనిచేసిన మీకు తెలుసు. అలాగే చిన్న పార్టీల సభ్యులకు సమయం ఇవ్వకపోతే ఆ పార్టీల నుంచి ఎన్నికైన వారు తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమవుతారు. తెదేపా తరఫున ఏకైక సభ్యునిగా ఉన్న నాకు చర్చల్లో పాల్గొనేందుకు తగినంత సమయం ఇస్తారని ఆశిస్తున్నా’ అని విన్నవించారు.

దేశానికి జవాబుదారీగా ఉండాలి: అయోధ్యరామిరెడ్డి

స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు కానున్న నేపథ్యంలో దేశానికి సభ జవాబుదారీగా ఉండాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సూచించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్‌ఖడ్‌ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో క్రమశిక్షణ, అంకితభావంతో సామాజిక, రాజకీయ రంగాల్లో అనుభవంతో ధన్‌ఖడ్‌ దేశానికి ఎంతో సేవ చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో... మీ(ఛైర్మన్‌) దిశానిర్దేశంలో సభ ఉత్తమంగా సాగుతున్న తీరును ప్రపంచానికి చూపించాల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది’ అని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని