BJP Vs AAP : మోదీకి జన్మనివ్వడమే ఆమె చేసిన నేరమా!: స్మృతి ఇరానీ

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను ఆప్‌ నేత గోపాల్‌ ఇటాలియా వెక్కిరించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది.

Published : 15 Oct 2022 00:46 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ (Gujarat Assembly) ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీ నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆమ్‌ఆద్మీపార్టీ గుజరాత్‌ చీఫ్‌ గోపాల్‌ ఇటాలియాకు (Gopal Italia) సంబంధించినట్లుగా చెబుతోన్న ఓ వీడియో ఇందుకు తాజాగా వేదికయ్యింది. ప్రధాని మోదీని (Narendra Modi) మాతృమూర్తిని ఆప్‌ నేత ఇటాలియా వెక్కిరించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇందుకు వచ్చే ఎన్నికల్లో గుజరాతీయుల నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని దుయ్యబట్టింది.

‘ఆమె చేసిన ఏకైక నేరం.. మీ (కేజ్రీవాల్‌) రాజకీయ నమూనాలను అడ్డుకునే నరేంద్ర మోదీకి జన్మనివ్వడమే. ప్రధానమంత్రి మాతృమూర్తిని అవమానించడం వల్ల రాజకీయంగా గుజరాత్‌లో పాపులారిటీ వస్తుందనుకుంటే పొరపాటే. అందుకు వచ్చే ఎన్నికల్లో మీరు మూల్యం చెల్లించుకునేలా ఓటర్లు చేస్తారు’ అని ఆమ్‌ఆద్మీ పార్టీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మండిపడ్డారు. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. కేజ్రీవాల్‌ సూచనల ప్రకారమే ఇటాలియా అటువంటి వ్యాఖ్యలు చేశారని, ఇది మహిళలను అవమాన పరచడమేనని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

రాజకీయాలకు సంబంధం లేని ఓ వందేళ్ల వృద్ధురాలిని కించపరచడం క్షమించరానిదన్న స్మృతి ఇరానీ.. పటీదార్‌ వర్గానికి చెందిన వ్యక్తిని కావడం వల్లే నన్ను భాజపా లక్ష్యంగా చేసుకుందని గోపాల్‌ ఇటాలియా చెప్పడాన్ని తప్పుపట్టారు. వారి రాజకీయ ముగింపునకే వర్గం, లింగం వంటి కార్డులను ఆమ్‌ఆద్మీ పార్టీ వాడుతోందని దుయ్యబట్టారు. కేవలం కేజ్రీవాల్‌ ఆశీస్సులతోనే ప్రధాని తల్లిపై గోపాల్‌ ఇటాలియా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

ఇదిలాఉంటే, ప్రధానిమంత్రిపై గోపాల్‌ ఇటాలియా చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, స్త్రీలను ద్వేషించేలా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్‌ ఆయనకు ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్‌ 13న ఎన్‌సీడబ్ల్యూ ముందు గోపాల్‌ ఇటాలియా హాజరయ్యారు. అదే సమయంలో ఎన్‌సీడబ్ల్యూ కార్యాలయం ముందు ఆప్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో గోపాల్‌ను దిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటల తర్వాత ఆయన్ను విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే భాజపా, ఆప్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని