Harish Rao: భాజపా ‘అమృత్‌కాల్‌’.. దేశ ప్రజలకు ఆపద కాలం: హరీశ్‌రావు

భారాస ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రాష్ట్రంలోని రైతులు సంబరపడుతుంటే.. ఇకపై అధికారం రాదేమోనని విపక్షాలు బాధపడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు.

Updated : 08 Feb 2023 16:40 IST

హైదరాబాద్‌: ప్రజలకు కావాల్సినంత పవర్‌ ఇచ్చినందునే తమకు ‘పవర్‌’ (అధికారం) ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పవర్‌ హాలిడే ఇచ్చినందునే కాంగ్రెస్‌కు ప్రజలు ‘హాలిడే’ ఇచ్చారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘భారాస ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రాష్ట్రంలోని రైతులు సంబరపడుతున్నారు. ఇకపై అధికారం రాదేమోనని విపక్షాలు బాధపడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు నిండు పున్నమిలోని వెన్నెలను చూడకుండా చందమామలోని మచ్చలను చూస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఏమీ చేయొద్దన్నట్లుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారు. గతంలో బడ్జెట్‌ సమావేశాల సమయంలో నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ తరచూ ప్రదర్శనలు జరిగేవి. అప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. బిందెడు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడిచేవారు. నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయి బాధపడేవారు. ప్రజల గుండెల మీద నుంచి ఫ్లోరైడ్‌ బండలు తొలగించెందెవరు? 

గోదావరి జలాలను 600 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత  తెలంగాణ సర్కారుదే. ప్రపంచమే ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే నిర్మించాం. మిషన్‌ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనాను తీసుకొచ్చాం. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్‌ ఘర్‌ జల్‌ పథకం సవ్యంగా ముందుకు సాగడం లేదు. మిషన్‌ భగీరథకు కేంద్రం అవార్డు కూడా ఇచ్చింది. చనిపోయిన వ్యక్తుల పేరు మీద కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. అమృత్‌కాల్‌ అని చెప్తున్న భాజపా పాలన.. దేశప్రజలకు ఆపద కాలంలా మారింది’’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని