Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి.. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే సభలోనూ చెప్పారు: హరీశ్‌రావు

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 16 Dec 2023 19:34 IST

హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని భారాస (BRS) ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. సభలో మాట్లాడుతూ సత్యదూరమైన విషయాలు వెల్లడించారని మండిపడ్డారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే సభలోనూ చెప్పారు. సభను, సభ ద్వారా రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంటామన్న కాంగ్రెస్‌ నేతలు.. సభ మొదటి రోజే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూశారు. సీఎం రేవంత్‌ రెడ్డి గంటన్నర సేపు మాట్లాడారు. మేం పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తితే.. స్పీకర్‌ మా వైపు చూడలేదు. క్లారిఫికేషన్‌కు అవకాశం ఇవ్వలేదు. సీఎం మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్‌ ఇచ్చేందుకు అవకాశం ఇస్తామన్నారు. కానీ, అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్‌ కట్ చేశారు. అధికార పార్టీ ఇవాళ పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరించింది. తమ తప్పులను ఎక్కడ ఎత్తిచూపుతారేమోనని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.

అమరవీరులను గౌరవించిందే భారాస. ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో అమరవీరుల కుటుంబసభ్యులను గౌరవించుకున్నాం. అమరులకు నివాళిగా సచివాలయం ఎదుటే అమరవీరుల స్మారకాన్ని నిర్మించుకున్నాం. ఆ ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌, భారాసకే దక్కుతుంది. రాష్ట్ర సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా స్మారకాన్ని చూసి ప్రతి నిమిషం అమరుల త్యాగాలు గుర్తుకురావాలని భావించాం. కానిస్టేబుల్‌ కిష్టయ్య కుమార్తెను దగ్గరకు తీసుకొని డాక్టర్‌ను చేసింది ఎవరు? భారాస కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా వ్యతిరేకించింది రేవంత్‌ రెడ్డి కాదా? ఇవాళ ఉద్యమకారులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి.. అమరుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు.

గత దశాబ్ద కాలంలో తెలంగాణలో వ్యవసాయ రంగం 6.59 శాతం వృద్ధి సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. నీతీ ఆయోగ్ ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంపై పెట్టిన దృష్టి కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైంది. వాస్తవాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అవాస్తవాలు మాట్లాడి సభను తప్పుదారి పట్టించారు’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు