MVA: మహారాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఎన్నాళ్లు?

మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ)’ ప్రభుత్వ మనుగడపై రోజురోజుకీ కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి పక్షాల మధ్య ముసలం ప్రారంభమైందన్న వాదన ముంబయి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది....

Updated : 21 Jun 2021 15:16 IST

తెరపైకి వస్తున్న అనేక ఊహాగానాలు

ముంబయి: మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ)’ ప్రభుత్వ మనుగడపై రోజురోజుకీ కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి పక్షాల మధ్య ముసలం ప్రారంభమైందన్న వాదన ముంబయి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే భాగస్వామ్య పక్షాలనుద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే, కూటమిలోని కాంగ్రెస్‌, శివసేన, ఎన్సీపీ ఐక్యంగానే ఉన్నాయని శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ సోమవారం తెలిపారు. తమ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనా కాలాన్ని పూర్తి చేసుకొని తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న బయటి వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంవీఏ సర్కార్‌ కొనసాగి తీరుతుందన్నారు. భాగస్వామ్య పక్షాల మధ్య బంధాన్ని తుంచేందుకు కొందరు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని.. కానీ, అవేవీ ఫలించవన్నారు. 

మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హామీ మేరకు ప్రస్తుతం ఉన్న ఎంవీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగి తీరుతుందన్నారు. మరోవైపు రానున్న బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని సోమవారం పార్టీ నగర చీఫ్‌ భాయ్ జగతాప్‌ స్పష్టం చేశారు. 

పటోలే వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే.. ‘‘సమస్యలకు పరిష్కారం చూపకుండా కేవలం ఒంటరిగా పోటీ చేయడంపైనే మాట్లాడితే.. ప్రజలు చెప్పుతో కొడతారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఎక్కడా కాంగ్రెస్‌ పేరుగానీ, పటోలే పేరుగానీ ఎత్తలేదు. శివసేనకు అధికార వ్యామోహం లేదని.. అనవసరంగా ఎవరినీ తాము భరించబోమని వ్యాఖ్యానించారు. అవసరమైతే తామూ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళదామని పిలుపు ఇవ్వగలమన్నారు. 

మరోవైపు ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశంలో కేవలం వారివురు నేతలు మాత్రమే ఉన్నారు. మోదీతో తాను ఒక్కడినే మాట్లాడాలనుకుంటున్నానని ఉద్ధవ్‌ కోరినట్లు దిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఆయన మోదీతో సత్సంబంధాలు ఉన్నాయనడం ఊహాగానాలకు తెరతీసింది. అనంతరం సంజయ్ రౌత్‌ సైతం మోదీని పొగుడుతూ ఓరోజు వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి బీజేపీపై శివసేన ఎక్కడా పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. మరోవైపు పార్టీలో సీనియర్‌ నేత సర్నాయక్‌ మాట్లాడుతూ.. శివసేన నేతల్ని కాపాడుకునేందుకు భాజపాతో చేతులు కలపాలని సూచిస్తూ సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎంవీఏ ప్రభుత్వంలో చీలికలు వచ్చాయని.. శివసేన, భాజపా మళ్లీ ఒకటి కానున్నాయన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని