SP-RLD: లోక్‌సభ ఎన్నికలు.. యూపీలో ఎస్పీ- ఆర్‌ఎల్‌డీ పొత్తు

లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లు తమ పొత్తు ప్రకటించాయి.

Published : 19 Jan 2024 23:04 IST

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఆయా పార్టీల మధ్య చర్చలు జోరందుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD)తో సమాజ్‌వాదీ పార్టీ (SP) తన దోస్తీ కొనసాగించనుంది. ఈమేరకు పొత్తు కుదిరినట్లు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav), ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ చౌధరీలు శుక్రవారం ప్రకటించారు. విజయం కోసం మనమందరం ఏకమవుదామని అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను చౌధరీ రీపోస్ట్‌ చేస్తూ.. జాతీయ, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

ఇరునేతల మధ్య జరిగిన సమావేశంలో సీట్ల పంపకాల విషయంలోనూ ఒప్పందం ఖరారైందని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు తెలిపారు. పశ్చిమ యూపీలోని ఏడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రెండు పార్టీలు 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేశాయి. ఎస్పీ 111, ఆర్‌ఎల్‌డీ ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో ఆర్‌ఎల్‌డీ భాగస్వామిగా ఉంది. మథుర, బాగ్‌పత్‌, ముజఫర్‌నగర్ స్థానాల్లో పోటీ చేసి.. మూడింట ఓడిపోయింది. ఎస్పీకి ఐదు, బీఎస్పీకి 10 సీట్లు వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికల్లో సోలోగానే పోటీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి

చౌధరీ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు జాట్ వర్గమే. ముజఫర్‌నగర్, కైరానా, బిజ్నౌర్, మథుర, బాగ్‌పత్, అమ్రోహా, మేరఠ్‌లు జాట్ జనాభా ఉన్న ఎక్కువగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలు. చౌధరి పార్టీ పోటీ చేసే స్థానాలు ఇవే కావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ.. ఈసారి ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించింది. ఎస్పీ, ఆర్‌ఎల్‌డీలు విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమే. లోక్‌సభ ఎన్నికలకు ఇవి పొత్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తుందో తేలాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని