MP Polls: సరిహద్దు అవతలివైపు ఉన్నా.. వారిని ఏరిపారేయగలం!.. రాజ్‌నాథ్‌ సింగ్‌

ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇప్పుడు భారత్‌ను బెదిరించే సాహసం చేయదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Published : 04 Nov 2023 16:34 IST

భోపాల్‌: ఎవరైనా దుష్ట కార్యకలాపాలకు పాల్పడేందుకు యత్నిస్తే.. సరిహద్దుకు ఇటువైపు, అవసరమైతే అటువైపు ఉన్నా కూడా వారిని భారత్‌ ఏరిపారేయగలదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (MP Elections) ప్రచారంలో భాగంగా ఇక్కడి భిండ్‌ జిల్లా గోహద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భారత అభిమానం వెల్లివిరుస్తోందన్నారు.

‘కాంగ్రెస్ హయాంలో విదేశీయులు భారత్‌ను ఓ బలహీన దేశంగా చెప్పేవారు. ప్రపంచ దేశాలు మన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అంతర్జాతీయ వేదికలపై మనం ఏదైనా చెబితే ప్రపంచం వింటోంది. ఇప్పుడు భారత్‌ బలహీన దేశం కాదు. ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని బెదిరించే సాహసం చేయదు. ఎవరైనా ఏదైనా దుర్మార్గానికి పాల్పడేందుకు యత్నిస్తే.. భారత్‌ వారిని నిర్మూలిస్తుంది. అవసరమైతే.. సరిహద్దు అవతలి వైపు ఉన్నా కూడా వారిని ఏరిపారేయగలదు’ అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

‘మహాదేవ్‌’ పేరునూ వదిలిపెట్టలేదు..! కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం

మధ్యప్రదేశ్ అంతకుముందు వెనుకబడిన రాష్ట్రమని, కానీ.. ఇప్పుడు అభివృద్ధి చూడాలంటే ఇక్కడికి వెళ్లాలని దేశ ప్రజలు అంటున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇది దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో తలసరి ఆదాయం 2001-02లో రూ.11,718గా ఉండగా.. 2023 నాటికి రూ.1.40 లక్షలకుపైగా పెరిగిందని తెలిపారు. భిండ్‌ జిల్లాలో ప్రతి ఐదు కుటుంబాలకు ఒకరు ఆర్మీలో ఉన్నారని, అలాంటి కుటుంబాలను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని