Kumaraswamy: ఆ 25 స్థానాల్లో ఓడిపోతామేమో : హెచ్‌డీ కుమారస్వామి

అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో తమకు ఎదురుదెబ్బ తప్పేలా లేదని జేడీఎస్‌ నేత కుమారస్వామి (H D Kumaraswamy) అన్నారు.

Published : 11 May 2023 01:27 IST

బిదాడి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections) పోలింగ్‌ వేళ.. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ (JDS) నేత హెచ్‌డీ కుమారస్వామి (H D Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా ధనబలాన్ని తట్టుకోలేకపోయామన్న ఆయన.. నిధుల కొరత వల్ల 25 గెలిచే స్థానాల్లో వెనకబడ్డామని అన్నారు. జేడీఎస్‌ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడలేకపోయినందుకు బాధగా ఉందన్న కుమారస్వామి.. మెజారిటీ సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

‘‘మా పార్టీ (JDS)లోని కొందరు అభ్యర్థులకు నేను ఆర్థికంగా అండగా ఉండలేకపోయా. అది నన్ను చాలా బాధిస్తోంది. నిధుల విషయంలో ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని భావించా. కానీ ఆశించినంత విరాళాలు పార్టీకి రాలేదు. చిక్కబళ్లాపూర్, దొడ్డబళ్లాపూర్‌ వంటి స్థానాల్లో జేడీఎస్‌కు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ అక్కడి అభ్యర్థులకు చివరి దశల్లో నేను పార్టీ నుంచి నిధులు అందించలేకపోయా. నిధుల కొరత కారణంగా గెలుస్తామనుకున్న దాదాపు 20-25 నియోజకవర్గాల్లో మాకు ఎదురుదెబ్బ తప్పేలా లేదు’’ అని కుమారస్వామి (H D Kumaraswamy) వ్యాఖ్యానించారు.

జేడీఎస్‌ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను తక్కువ చేసి చూడొద్దని పార్టీ కార్యకర్తలకు కుమారస్వామి సూచించారు. ‘‘అదంతా నాతప్పే. ఆశించినంత నిధులను నేను వారికి సమకూర్చలేకపోయా. అయితే 50-60 స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు గట్టి పోటినిస్తున్నారు. ఇన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో  120కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (Karnataka Elections) ఈ సందర్భంగా ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడిస్తే జేడీఎస్‌ పాత్ర ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం..! అయితే మేం కింగ్‌ మేకర్స్‌ మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మా పార్టీ కింగ్‌గా మారబోతోంది’’ అని విజయంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ (JDS) 37 స్థానాల్లో విజయం సాధించి కింగ్‌ మేకర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే, ఆ తర్వాత ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఇక తాజా ఎన్నికల్లో జేడీఎస్‌ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈసారి కూడా ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వేశాయి. దీంతో జేడీఎస్‌ మరోసారి కింగ్‌మేకర్‌ కానున్నట్లు కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు