దీదీ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయ్‌!

బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత  రైతులకు న్యాయం చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌  పట్టుకోల్పోతున్న .....

Updated : 09 Jan 2021 17:30 IST

కత్వా: బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత  రైతులకు న్యాయం చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్టుకోల్పోతున్న విషయాన్ని గ్రహించే దీదీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు అంగీకరించాల్సి వచ్చిందన్నారు. కానీ, ఇప్పటికే ఈ పథకం అమలులో చాలా జాప్యం జరిగిపోయిందని విమర్శించారు. శనివారం ఆయన ‘కర్షక్‌ సురక్షా అభియాన్‌’ పేరుతో నిర్వహించిన రైతుల సభలో ప్రసంగించారు. 

పీఎం కిసాన్‌ పథకాన్ని రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేయని మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఇటీవల దీనిపై తన వైఖరిని మార్చుకున్న విషయం తెలిసిందే. కత్వాలో రైతు ర్యాలీని చూస్తుంటే.. మమతా బెనర్జీ ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకుంటున్నట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే దీదీ సర్కార్‌ను సాగనంపి రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందని చెప్పారు. 

మరోవైపు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికారం నిలబెట్టుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి పాగా వేయాలని భాజపా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే సువేందు అధికారి సహా దాదాపు 60మందికి పైగా నేతలు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరారు. ఈ తరుణంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇదీ చదవండి..

బెంగాల్‌లో జేపీ నడ్డా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని