Kamal haasan: స్టాలిన్‌తో నా స్నేహం.. రాజకీయాలకు అతీతం: కమల్‌ హాసన్‌

సీఎం స్టాలిన్‌(stalin) పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సినీ నటుడు కమల్‌ హాసన్‌(kamal haasan) ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Updated : 28 Feb 2023 19:46 IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK stalin)తో తన ఫ్రెండ్‌షిప్‌ రాజకీయాలకు అతీతమైందని మక్కల్‌నీది మయ్యమ్‌ అధినేత, సినీ నటుడు కమల్‌ హాసన్‌(Kamal haasan) అన్నారు. స్టాలిన్‌, తాను ఎప్పటినుంచో స్నేహితులమని చెప్పారు. మార్చి 1న సీఎం స్టాలిన్‌ 70వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా
చెన్నైలోని రాజా అన్నామలై ఫోరమ్‌లో ‘అవర్‌ సీఎం అవర్‌ ప్రైడ్‌’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కమల్‌ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ మార్చి 12వరకు కొనసాగనుంది.

ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరించేందుకు(మరీ ముఖ్యంగా తమిళుల చరిత్ర) ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలు చెప్పేలా ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. ‘‘నేను, స్టాలిన్‌ మిత్రులం. మా స్నేహం రాజకీయాలకు అతీతమైనది. ఓ మహా నేత తనయుడు స్టాలిన్‌. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగారు. ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తుల గురించి ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు. 

మరోవైపు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ మాట్లాడుతూ.. 2019లో చెన్నైలో మహా కూటమి ఏర్పాటు చేసిన డీఎంకే 2021లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో డీఎంకే కూటమి గెలుచుకుంటుందని తమ నేత భరోసా ఇచ్చారన్నారు.

కమల్‌ హాసన్‌ డీఎంకే కూటమి వైపు మొగ్గుచూపుతున్నారా అని విలేకరులు అడగ్గా.. ‘‘కమల్‌హాసన్‌ భావసారుప్యత కలిగిన వ్యక్తి. ఆయన డీఎంకేకు, సీఎం స్టాలిన్‌కు మంచి మిత్రుడు. స్టాలిన్‌ 70వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన గౌరవంగా వచ్చారు’’ అని దయానిధి మారన్‌ చెప్పారు. తమిళనాడులో నిన్న ఈరోడ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగ్గా.. డీఎంకే కూటమి అభ్యర్థికి కమల్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని