BRS: సీఎం కేసీఆర్‌ మా పెద్దన్న: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

భారాస ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Updated : 18 Jan 2023 20:51 IST

ఖమ్మం: భారాస ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు హాజరుకావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది. 

కంటి వెలుగు దిల్లీలోనూ అమలు చేస్తాం: కేజ్రీవాల్‌

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమన్న కేజ్రీవాల్‌.. తెలంగాణలో అమలు చేస్తున్న  కంటి వెలుగు కార్యక్రమాన్ని దిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు.  ‘‘ మేం  ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం. దిల్లీ మొహల్లా క్లినిక్‌లను ఇక్కడ బస్తీ దవాఖానాగా మార్చారు.  మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్‌ దిల్లీ గల్లీలో తిరిగారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ దిల్లీ పాఠశాలలు పరిశీలించారు. తమిళనాడులోనూ పాఠశాలలు బాగు చేసుకున్నారు. దిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది.  మోదీ పాలనలో గవర్నర్లను ఆడిస్తున్నారు. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బందులు పెడుతున్నారు. సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశం’’ అని  సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.

లూటీ చేయడం.. అమ్మడమే భాజపా సిద్ధాంతం: భగవంత్‌ మాన్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ... భారాస ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం మార్పునకు తొలి అడుగుగా అభివర్ణించారు. తెలంగాణలో ‘కంటి వెలుగు’ వంటి మంచి పథకం చేపట్టారని కొనియాడారు. ‘‘ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశం ఎటు వెళ్తుందోనని ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఏటా 2కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా మోసం చేసింది. యువతకు ఉపాధి కల్పిస్తామన్న హమీ నెరవేర్చలేదు. ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేశారు. హమీలు నెరవేర్చకుండా భాజపా.. భారతీయ జుమ్లా పార్టీగా మారింది. లూటీ చేయడం.. అమ్మడమే భాజపా సిద్ధాంతం.  కేంద్ర సంస్థలు ఎల్‌ఐసీ, రైల్వేను అమ్మకానికి యత్నిస్తోంది. పంజాబ్‌లో చరిత్రాత్మక విజయం ఆప్‌ సాధించింది. పంజాబ్‌లో అవినీతిని రూపుమాపాం. తెలంగాణ మాదిరి కార్యక్రమాలు పంజాబ్‌లోనూ చేపడతాం. మంచి కార్యక్రమాలు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. అభివృధ్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది’’ అని భగవంత్‌ మాన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు