KTR: పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్‌ దుర్భాషలు.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేటీఆర్‌ ట్వీట్‌

నగరంలోని భోలక్‌పూర్‌లో పోలీసులపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్‌ కోరారు.

Updated : 06 Apr 2022 11:45 IST

హైదరాబాద్‌: నగరంలోని భోలక్‌పూర్‌లో పోలీసులపై కార్పొరేటర్‌ సహా కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన ట్వీట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్‌లో దుకాణాలు మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులు కోరారు. రంజాన్‌ సందర్భంగా దుకాణాలు తెరుచుకున్నామంటూ కొందరు దుకాణదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులపై దుర్భాషలాడారు. దుకాణాలను మూసివేయించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

‘‘రంజాన్‌ మాసంలో తెల్లవార్లూ హోటళ్లు తెరిచి ఉంటాయి. నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దు. పోలీసులు తమాషాలు చేస్తున్నారు. తమ డ్యూటీ తాము చేసుకొని వెళ్లిపోవాలి’’ అని కార్పొరేటర్‌ అంటున్నట్లు వీడియోలో ఉంది. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్‌ అనగానే ‘‘రూ.100 వ్యక్తివి నువ్వు.. నాకు సమాధానం చెబుతావా? మీ ఎస్సైని పిలిపించు.. కార్పొరేటర్‌ వచ్చాడని చెప్పు’’ అంటూ ఆయన దురుసుగా మాట్లాడారు.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ కేటీఆర్‌కు ట్వీట్‌ చేస్తూ కార్పొరేటర్‌ఫై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్‌ ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని