దీదీ ఆత్మపరిశీలన చేసుకోవాలి..! అమిత్‌ షా

బెంగాల్‌ ప్రజలు తృణమూల్‌పై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయంపై మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించారు.

Published : 09 Apr 2021 15:02 IST

ఓటమి భయంతోనే కేంద్ర బలగాలపై విమర్శలు

కోల్‌కతా: బెంగాల్‌ ప్రజలు తృణమూల్‌పై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయంపై మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించారు. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఇప్పటివరకు 91 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తికాగా, వీటిలో 60కి పైగా స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

‘తృణమూల్‌ కాంగ్రెస్‌పై బెంగాల్‌ ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో మమతా బెనర్జీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాష్ట్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరింది. శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా దిగజారింది. గత పదేళ్ల దీదీ పాలనతో బెంగాల్‌ ప్రజలు విసిగిపోయారు’ అని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోకి చొరబాట్లను, సీఏఏ వ్యతిరేక శక్తులను అడ్డుకోవడంలో మమతా బెనర్జీ విఫలమయ్యారని అన్నారు.

పోలింగ్‌ సమయంలో కేంద్ర బలగాలపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను అమిత్‌ షా తీవ్రంగా తప్పుబట్టారు. బలగాలపై ఎదురుదాడికి దిగాలని ఓటర్లను రెచ్చగొడుతున్నారని.. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కారణంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. ఈ సందర్భంగా అరాచకానికి పాల్పడాలని బెంగాల్‌ ప్రజలను పురిగొల్పుతున్నారా? అని మమతా బెనర్జీని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ సమయంలో జరుగుతోన్న హింసను ముఖ్యమంత్రి ఖండించకపోవడం విడ్డూరమని దుయ్యబట్టారు. మైనారిటీ ఓటర్లు దూరమవుతున్నారనే భయంతోనే మమతా బెనర్జీ.. ఆ ఓటర్లకు పదేపదే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని