ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!

ఫొటోలు, వీడియోలు ఎన్ని ఉన్నా... చేత్తో గీసే బొమ్మలు ఇచ్చే ఆనందమే వేరు. దానికి ప్రత్యేకతను జోడిస్తూ ‘లైవ్‌ పెయింటింగ్‌’ చేస్తోంది ధనుష్య పళ్లెం. విదేశాల్లో ఖ్యాతిగాంచిన ఈ ప్రక్రియను తెలుగునాట పరిచయం చేస్తోందీ అమ్మాయి.

Updated : 03 May 2024 07:30 IST

ఫొటోలు, వీడియోలు ఎన్ని ఉన్నా... చేత్తో గీసే బొమ్మలు ఇచ్చే ఆనందమే వేరు. దానికి ప్రత్యేకతను జోడిస్తూ ‘లైవ్‌ పెయింటింగ్‌’ చేస్తోంది ధనుష్య పళ్లెం. విదేశాల్లో ఖ్యాతిగాంచిన ఈ ప్రక్రియను తెలుగునాట పరిచయం చేస్తోందీ అమ్మాయి. ఆ ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా...

మాది విజయవాడ. నాన్న నాగ వెంకటేశ్వరరావు ప్రైవేటు కాంట్రాక్టర్‌. అమ్మ శేషకుమారి. మా కుటుంబంలో అందరూ ఆర్టిస్టులే. నాన్నకైతే బొమ్మలు గీయడమంటే ప్రాణం. ఆయన్ని చూసి నేనూ చిన్నచిన్న బొమ్మలు గీసేదాన్ని. వాటిని చూసి అందరూ మెచ్చుకునేవారు. మా డ్రాయింగ్‌ టీచర్‌ అయితే ఏకంగా పోటీలకీ పంపేవారు. దాంతో ఎనిమిదో తరగతి నుంచి మరింత శ్రద్ధపెట్టా.

ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బొమ్మ గీసి, ఫేస్‌బుక్‌లో పెడితే బోలెడు ప్రశంసలు వచ్చాయి. దీంతో సెలెబ్రిటీలవి కొనసాగిస్తూ వచ్చా. ఏమాత్రం సమయం దొరికినా నా వ్యాపకమదే. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. పగలు ఉద్యోగం... రాత్రి ఇంటికొచ్చాకా బొమ్మలు గీయడమే! అప్పుడే యూఎస్‌కి చెందిన ఓ వ్యక్తి ‘లైవ్‌ వెడ్డింగ్‌ పెయింటింగ్‌’ వేయడం చూశా. వేడుక పూర్తయ్యే సమయానికి వధూవరుల చిత్రాలను, వారి వెనక ఉన్న డెకరేషన్‌తో సహా వేయడం... పూర్తయ్యాక ఆ దంపతుల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం నన్ను ఆకర్షించాయి. ఒక ఆర్టిస్ట్‌కి మెచ్చుకోలుకి మించిన ప్రశంస ఏముంటుంది? అందుకే నాకూ ప్రయత్నించాలి అనిపించింది. దీంతో అతన్ని సోషల్‌మీడియాలో సంప్రదించి, వివరాలు తెలుసుకున్నా. దీనికోసం ఉద్యోగాన్నీ పక్కన పెట్టేద్దామనుకున్నా. అయితే అతను ‘బాగుంటుంది కానీ... రిస్క్‌ ఎక్కువ. ఉద్యోగం చేస్తూ ప్రయత్నించ’మని సలహానిచ్చాడు. దీంతో ఆలోచనలో పడ్డా. మూడేళ్లు దీనిపై పరిశోధనలు చేసి, నాపై నాకు నమ్మకమొచ్చాక ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగానికి రాజీనామా చేశా.

సమస్యల్లా దీనిపై ఎవరికీ అవగాహన లేదు. ఇక అవకాశమెలా వస్తుంది? తెలిసినవారందరికీ నా పని గురించి చెప్పా. అప్పుడు ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ అవకాశమిచ్చింది. అది రిసెప్షన్‌. నేనేం చేస్తున్నానో వధూవరులకే కాదు... అక్కడికి వచ్చినవారికీ తెలియదు. అందరూ ఏం చేస్తున్నావని అడిగేవారు. ఓపికగా చెబుతూనే నా పని ముగించి, ఆ చిత్రాన్ని వధూవరులకు చూపిస్తే ఆశ్చర్యపోయారు. ఉచితంగానే చేసినా... అదో సంతృప్తి. ఇన్‌స్టాలో ఆ వీడియో పోస్ట్‌ చేశా. అప్పట్నుంచీ అవకాశాలు వరసకట్టాయి. ఇప్పటివరకూ 12 చేశా. వేడుక ప్రారంభమవ్వడానికి ముందు... డెకరేషన్‌ పూర్తవ్వగానే నా పని ప్రారంభిస్తా. వధూవరులు వేదిక మీదకివచ్చాక వాళ్ల బొమ్మగీస్తా. పూర్తవడానికి 6-7 గంటలు పడుతుంది. తర్వాత వార్నిష్‌ చేసిస్తా. ఎలా తీసుకెళ్లాలో జాగ్రత్తలు కూడా చెబుతా. ఉద్యోగం మానేసినప్పుడు అమ్మానాన్నలు కంగారుపడ్డారు. రెండు నెలల్లో అనుకున్నది చేయలేకపోతే తిరిగి ఉద్యోగంలో చేరతానని చెప్పా. ఇప్పుడు వాళ్లూ ఆనందంగా ఉన్నారు. లైవ్‌ పెయింటింగ్‌తోపాటు ఇతర ప్రాజెక్టులనూ చేస్తున్నా. ఈ రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలి, దేశంలో ఉత్తమ ఆర్టిస్ట్‌ల్లో ఒకరిగా నిలవాలన్నది లక్ష్యం. ఎగ్జిబిషన్లు నిర్వహించాలనీ ఉంది.


మీకు తెలుసా?

ఆ సమయం విలువ...

ప్రపంచవ్యాప్తంగా మూడో వంతుకుపైగా మహిళలు... ఇంటిపనీ, వంటపనీ, పిల్లల సంరక్షణ బాధ్యతలకు రోజులో 7.2 గంటలు కేటాయిస్తున్నారట. పైగా దీనికి ఎలాంటి వేతనమూ ఉండదు. అయితే పురుషులతో పోలిస్తే ఈ పని గంటలు మహిళలకి అదనపు భారమేనట. వేతనం చెల్లించని పనికి ద్రవ్య విలువను కేటాయిస్తే దేశ జీడీపీ సైతం పెరిగే అవకాశం ఉందని వివిధ దేశాలు గతేడాది చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఈ అంచనాల ప్రకారం చూస్తే- ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది మహిళలు గృహకార్మికులుగానే జీవిస్తున్నారు. అంతేకాదు, వీరికి వారాంతపు సెలవులు కూడా లేవు. అంటే... ప్రపంచవ్యాప్తంగా మహిళలు రోజుకి సుమారు 1640 కోట్ల గంటలు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్