AP Elections: కొలిక్కి వచ్చిన తెదేపా - జనసేన - భాజపా సీట్ల సర్దుబాటు

ఉండవల్లిలోని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో జరిగిన మూడు పార్టీల కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.

Updated : 12 Mar 2024 09:23 IST

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - భాజపా మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా భాజపా - జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. వీటిలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో కమలం పార్టీ.. 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగనున్నాయి. మిగిలిన చోట్ల తెదేపా పోటీ చేయనుంది. ఈ మేరకు ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా జాతీయనేత బైజయంత్‌ ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం మూడు పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 

ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని నేతలు పేర్కొన్నారు. సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఒక అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని మూడు పార్టీల నేతలు వెల్లడించారు. సీట్ల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని వివరించారు.

8 గంటలకుపైగా భేటీ

భాజపా-జనసేనకు తొలుత 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తమ కోటాలో నుంచి భాజపాకు జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వగా.. అదనంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం ఇచ్చింది. సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో రాజకీయ వ్యూహం, ఈ నెల 17న తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ గురించి వీరి మధ్య 8 గంటలకుపైగా చర్చ జరిగింది. ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా ఏ విధంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తుందనే అంశంపైనా నేతలు కీలకంగా చర్చించినట్లు సమాచారం. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకుంటున్న తీరు, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగం అంశాలపైనా చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.

లోకేశ్‌ నేతృత్వంలో సభ ఏర్పాట్లు

ప్రధాని మోదీ పాల్గొనే మూడు పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల 17నే నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట బొప్పూడి వద్ద నిర్వహించే ఈ సభ తేదీని నేతలు ఖరారు చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నేతృత్వంలో సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనున్నాయి. మరోవైపు జనసేన ఏడు అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే ప్రకటించింది. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్‌ వెల్లడించారు. మిగిలిన 24 స్థానాల్లో జనసేన, భాజపాలు ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. భాజపా మంగళవారం ప్రకటిస్తుందనుకుంటున్న ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఏపీ నుంచి పలువురు అభ్యర్థుల పేర్లు ఉండవచ్చని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు