ఎంఎస్ఎంఈలకు ఊరట కల్పించండి: కేటీఆర్‌

కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని

Updated : 07 Jul 2021 17:40 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ

హైదరాబాద్‌: కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ మరోసారి లేఖ రాశారు. కరోనా నిబంధనలు సడలించడం ద్వారా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు అవసరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

‘‘గత ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున విస్తరించాయి. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇవన్నీ గత ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. దీంతో చిన్నపరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ పరిశ్రమల కార్యకలాపాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిమితులు విధించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఎంఎస్ఎంఈలకు అవసరమైన ముడిసరుకులు సకాలంలో అందలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికే తయారు చేసిన ఉత్పత్తులను రవాణా ఇబ్బందులతో ఏజెన్సీలకు తరలించలేకపోయారు. ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల రుణాల చెల్లింపు పైన వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించాలి. అప్పటిదాకా రుణాల పైన వడ్డీని ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకోవాలి. అలా చేయడం ద్వారా ఎంఎస్ఎంఈలకు ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి మద్దతు లభించగలిగితే ఎంఎస్‌ఎంఈలు పూర్వ స్థితికి చేరుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచిస్తున్న ఈ సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి’’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని