MLC Kavitha: 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగిస్తే బిల్లు చెల్లించొద్దు: ఎమ్మెల్సీ కవిత

200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రజలకు సూచించారు.

Updated : 27 Dec 2023 19:22 IST

నిజామాబాద్‌: 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రజలకు సూచించారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మీడియాతో మాట్లాడారు.

సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని, ఈ క్రమంలో రెండు మూడు అంశాలపై ప్రజలకు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా రూ.2వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ ఎందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆ 44లక్షల మందికి జనవరి 1 నుంచి రూ.4వేల పింఛను ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డులకే పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది. కొత్తకార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. వెంటనే కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమచేయలేదని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. రూ.4వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదు?’’ అని కవిత ప్రశ్నించారు. ఓట్ల శాతంలో భారాసకు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద తేడా లేదని, కేవలం 2శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని