దీదీ.. వాళ్లని అదుపులో పెట్టండి: మోదీ హెచ్చరిక 

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ భాజపా నేతలను ‘బయటి వ్యక్తులు’గా పేర్కొన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 04 Apr 2021 11:44 IST

సోనార్‌పూర్‌: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ శనివారం దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని సోనార్‌పూర్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ భాజపా నేతలను ‘బయటి వ్యక్తులు’గా పేర్కొన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీని డబ్బు దోచుకొనే కంపెనీగా ఆయన అభివర్ణించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలను అదుపులో పెట్టుకోవాలని మమతకు సూచించారు. ‘‘మోదీ ఇక్కడే ఉన్నారని ఆ గూండాలకు చెప్పండి.. ఇక బెదిరింపులను క్షమించేది లేదు’’ అని ప్రధాని హెచ్చరించారు.

‘‘బెంగాల్‌కు కావాల్సింది హింస, భయం కాదు. ఇక్కడి బాలికలకు విద్య కావాలి. భద్రత కావాలి. తల్లులకు గౌరవం కావాలి. న్యాయం దక్కాలి’’ అని మోదీ అన్నారు.

దీదీ వ్యాఖ్యలు దేశ సమగ్రతను నినదించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను, భారత రాజ్యాంగ సూత్రాలను అవమానించడమేనన్నారు. బ్రిటిష్‌ వాళ్లు మనల్ని విభజించే ప్రయత్నం చేసినప్పుడు ‘‘భారత్‌ ఒక్కటే.. ప్రతి భారతీయుడి ఆశలు, ఆశయాలూ ఒక్కటే’’ అంటూ నేతాజీ చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. కానీ ఈరోజు నేతాజీ భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బదులు, అందుకు విరుద్ధంగా మమత వ్యాఖ్యలు చేస్తుండటం బాధను కలిగిస్తోందన్నారు. దీదీ ‘బయటి వ్యక్తులు’ అని మాట్లాడుతున్నారనీ, కానీ మనమంతా భరతమాత బిడ్డలమేనన్నారు. ఏ భారతీయుడూ బయటివాడు కాదని చెప్పారు. మే 2 తర్వాత రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, బెంగాల్‌ భూమి పుత్రుడైన స్థానిక వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని