Priyanka Gandhi: ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తాన్ని ధారపోసింది!

ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. రాహుల్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కేంద్రంపై ఆమె ధ్వజమెత్తారు.

Published : 25 Mar 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు (disqualification) వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ కుటుంబం రక్తాన్ని ధారబోసిందని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని నేడు మోదీ (Modi) సర్కారు అణచివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘మోదీజీ (PM Modi).. అమరవీరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి అంటూ మీ వాళ్లు విమర్శించారు. మీ ముఖ్యమంత్రి ఒకరు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తండ్రి ఎవరు? అని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ ఓ కొడుడు తన తండ్రి మరణం తర్వాత తలపాగా ధరిస్తే దాన్నీ రాజకీయం చేశారు. నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోలేదని మీరు (మోదీని ఉద్దేశిస్తూ)  ఆ రోజు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. అది మా కుటుంబాన్నీ, కశ్మీరీ పండిట్లను కించపర్చడం కాదా? కానీ దీనికి ఏ కోర్టు మీకు రెండేళ్ల జైలు శిక్ష వేయలేదు. అనర్హత వేటు పడలేదు. రాహుల్‌ లాంటి నిజమైన దేశభక్తుడు ఈ కుంభకోణాల గురించి ప్రశ్నించారు. మీ స్నేహితుడు అదానీ.. పార్లమెంట్‌ కంటే గొప్పవాడా? మా కుటుంబాన్ని మీరు పరివార్‌వాదీ అంటూ చులకన చేసి మాట్లాడారు. కానీ, ఇది తెలుసుకోండి..! మా కుటుంబం ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ రక్తాన్ని ధారపోసింది. ఆ ప్రజాస్వామ్యాన్ని (democracy) మీరు ఇప్పుడు నాశనం చేయాలని చూస్తున్నారు. మా కుటుంబం ప్రజల కోసం గళమెత్తింది. తరతరాలుగా నిజం కోసం పోరాడుతోంది. అదే రక్తం మా నరనరాల్లో ప్రవహిస్తోంది. దానికో ప్రత్యేకత ఉంది. మీ లాంటి అధికార దాహం ఉన్నవారు.. నియంతల ముందు మేం ఎన్నడూ తలవంచలేదు.. తలవంచబోం కూడా. మీకు కావాల్సింది చేసుకోండి’’ అంటూ ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు.

మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిన్న సూరత్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద.. రాహుల్‌పై నేడు అనర్హత వేటు పడింది. అయితే, ఈ తీర్పును రాహుల్‌ పై కోర్టుల్లో సవాల్‌ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని