Punjab Polls: 1300 మంది అభ్యర్థుల్లో.. 521 మంది కోటీశ్వరులు

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. మొత్తం 117 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా.. 1304 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అయితే

Published : 11 Feb 2022 18:46 IST

ఎన్నికల్లో పోటీ చేస్తోన్న వారిలో 25శాతం మంది నేరచరితులే

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోంది. మొత్తం 117 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా.. 1304 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అయితే వీరిలో 25శాతం మంది నేర చరితులే కావడం గమనార్హం. 57 నియోజకవర్గాల్లో అయితే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది నేర అభియోగాలున్న వ్యక్తులే పోటీలో ఉన్నారు. ఇక మొత్తం అభ్యర్థులో 521 మంది కోటీశ్వరులున్నారు. ఈ మేరకు అసోషియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ నివేదిక వెల్లడించింది.

మొత్తం 1304 మంది అభ్యర్థుల్లో 1276 మంది ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్‌ ఈ నివేదిక రూపొందించింది. మిగతా 28 అభ్యర్థుల ప్రమాణ పత్రాల్లో వివరాలు పూర్తిగా లేకపోవడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్‌ తెలిపింది. పంజాబ్‌ ఎన్నికల్లో జాతీయ పార్టీల నుంచి 228 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 256 మంది పోటీ చేస్తున్నారు. 447 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. మిగతా వారు గుర్తింపు లేని పార్టీల నుంచి పోటీ చేస్తున్నట్లు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. 

315 మందిపై క్రిమినల్‌ కేసులు

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 25 శాతం అంటే 315 మంది తమపై నేర అభియోగాలు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇందులో 218 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిసింది. నేర చరిత గల అభ్యర్థులు ఎక్కువగా ఉన్నది శిరోమణి అకాలీదళ్‌ పార్టీలోనే. ఎస్‌ఏడీ నుంచి 96 మంది బరిలో ఉండగా.. 60 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీలో 27, భాజపాలో 15, కాంగ్రెస్‌లో 8 మందిపై తీవ్రమైన నేర అభియోగాలున్నాయి. 15 మంది అభ్యర్థులకు మహిళలపై నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. ఇందులో ఇద్దరిపై అత్యాచార అభియోగాలు కూడా ఉన్నాయి. నలుగురు హత్య కేసులో, 33 మంది అభ్యర్థులు హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్నారు.

41శాతం మంది కోటీశ్వరులు

గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కోటీశ్వరుల జాబితా పెరిగింది. 2017 ఎన్నికల్లో 428 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాగా.. తాజా ఎన్నికల్లో ఈ సంఖ్య 512కు పెరిగింది. మొత్తం పోటీ చేస్తున్న వారిలో 41శాతం మంది సంపన్నులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీలో 107 మంది కోటీశ్వరులు ఉండగా.. శిరోమణి అకాలీదళ్‌ పార్టీలో 89 మంది, ఆమ్‌ ఆద్మీ పార్టీలో 81, భాజపాలో 60 మంది అభ్యర్థులు తమ ఆస్తులు రూ.కోటి పైనే ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తోన్న కుల్వంత్‌ సింగ్‌ రూ.238 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ రూ.202 కోట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి కరణ్‌ కుమార్‌ రూ.155 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నారు. 

పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని