MP polls: మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ ‘ఉచిత’ ఫార్ములాకు రెడీ..!

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Polls) కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంటుతోపాటు పేద మహిళలకు ప్రతినెల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రకటించింది.

Published : 19 May 2023 01:41 IST

భోపాల్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. రానున్న ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ‘ఉచితాల’ (Freebies) వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కూడా అదే విధమైన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే.. కుటుంబాలకు 100 యూనిట్ల కరెంటును ఉచితంగా (Free Electricity) అందించడంతోపాటు మరో 100 యూనిట్లను సగం ధరకే ఇస్తామని ప్రకటించారు. ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. మహిళలకూ ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది.

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో బహిరంగ సభలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని మొదటిసారి చెబుతున్నా. మరో 100 యూనిట్లను సగం ధరకే అందిస్తాం. తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు నెలకు రూ.1500 నగదు అందించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకువస్తాం’ అని కమల్‌నాథ్‌ ప్రకటించారు. ఇక భాజపాపై విమర్శలు గుప్పించిన ఆయన.. సమాజంలో విభజన తెచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇక 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 114 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కమల్‌నాథ్‌.. ఏడాదిపాటు ఆ పదవిలో కొనసాగారు. అయితే, 2020లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో భాజపా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని