Nara Lokesh: రూ.5 ఇస్తే.. పేటీఎం బ్యాచ్‌ ఏమైనా చేస్తుంది: నారా లోకేశ్‌

వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు.

Updated : 19 Feb 2024 14:37 IST

విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు.

ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను వైకాపా నేతలు విషాదనగరంగా మార్చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్‌.. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు. సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తెదేపా-జనసేన ప్రభుత్వం వస్తుందని.. రెండు నెలలు ఓపిక పట్టాలని కోరారు.

‘‘తెదేపా, జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5 ఇస్తే పేటీఎం బ్యాచ్‌ ఏమైనా చేస్తుంది. పవన్‌కల్యాణ్ చెప్పినట్లు ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ నినాదానికి కట్టుబడి ఉండాలి. తెదేపా కార్యకర్తల కోరిక మేరకు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అందరి పేర్లూ రెడ్‌ బుక్‌లో ఉన్నాయి. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను నేను తీసుకుంటా’’ అని లోకేశ్‌ అన్నారు.

యువతకు 20 లక్షల ఉద్యోగాలు

తెదేపా అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్‌ తెలిపారు. ఉత్తరాంధ్రకు సీఎం జగన్‌ కనీసం ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. తెదేపా అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయమని హామీ ఇచ్చారు. తెదేపా పసుపు సైన్యం, జనసేన సైనికుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాబు సూపర్‌ 6తోపాటు, ఇతర గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికే నామినేటెడ్‌ పదవులు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏపీఐఐసీ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని