Mamata-Nitish Meet: భాజపా జీరో కావడమే కోరిక..! నీతీశ్‌తో దీదీ భేటీ

తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) సమావేశమైన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) విపక్షాల ఐక్యతపై చర్చించారు.

Published : 24 Apr 2023 20:51 IST

కోల్‌కతా: విపక్షాల ఐక్యత (Opposition Unity) కోసం జరుగుతోన్న ప్రయత్నాల్లో మరో ముందడుగు చోటుచేసుకుంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు సమావేశమవుతోన్న వేళ బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar).. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో (Mamata Banerjee) భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి కోల్‌కతా వెళ్లిన ఆయన.. దీదీతో సమావేశమై విపక్షాల ఐక్యత విషయంపై చర్చించారు. అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ.. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపై వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని వెల్లడించారు.

‘నీతీశ్‌కు ఓ విన్నపం చేశాను. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పోరాటం బిహార్‌ నుంచే మొదలయ్యింది. అలాగే బిహార్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. అంతకుముందు మనమందరం కలిసే ఉన్నామనే సందేశం ఇవ్వాలి. మాకు వ్యక్తిగత భేషజాలు లేవు. భాజపా జీరో కావడమే నేను కోరుకునేది. తప్పుడు వార్తలు, అబద్ధాలతో వారు (భాజపా) హీరోగా చెలరేగిపోతున్నారు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

‘సమావేశంలో సానుకూల చర్చ జరిగింది. ముఖ్యంగా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ఏకమయ్యే విషయమై చర్చించాం. విపక్షాలన్నీ కూర్చొని వ్యూహాన్ని రచించాల్సిన అవసరం ఉంది’ అని నీతీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డ ఆయన.. దేశాభివృద్ధికి భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేవలం వారు సొంత ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే, విపక్షాల ఐక్యతకు సంబంధించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో నీతీశ్‌ కుమార్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తోనూ సమావేశమైన మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తోనూ ఇటీవల చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని