Maharashtra Crisis: మహా సంక్షోభం వెనుక భాజపా హస్తం.. ఆ పార్టీ చీఫ్‌ ఏమన్నారంటే?

ఏక్‌నాథ్‌ శిందే సహా పలువురు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక భాజపా హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ తోసిపుచ్చారు....

Published : 24 Jun 2022 13:44 IST

ముంబయి: ఏక్‌నాథ్‌ శిందే సహా పలువురు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక భాజపా హస్తం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ తోసిపుచ్చారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ పాత్రేమీ లేదని తెలిపారు. అయితే, వేరే పని నిమిత్తం ఇటీవల తమ నేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌ దిల్లీకి వెళ్లినట్లు ధ్రువీకరించారు. ఈ పర్యటనకు సంబంధించి ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ఏక్‌నాథ్‌ శిందే సహా పలువురు శివసేన, స్వతంత్ర ఎమ్మెల్యేలు గువాహటిలోని హోటల్‌లో బస చేస్తున్నారు. తనకు మొత్తం 50 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ శిందే శుక్రవారం ఉదయం తెలిపారు. వీరిలో 40 మంది శివసేనకు చెందినవారన్నారు.

శివసేన పార్టీలో వచ్చిన ఈ అంతర్గత సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రకాంత్‌ పాటిల్‌ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఫడణవీస్‌తో కలిసి తాను మధ్యాహ్న భోజనం చేశానన్నారు. తర్వాత ఆయన దిల్లీ బయలుదేరి వెళ్లారన్నారు. అయితే, ఆ సమయంలో ఫడణవీస్‌ తనతో తాజా సంక్షోభంపై పెద్దగా చర్చించలేదన్నారు. ఏదైనా ఉంటే తన నిర్ణయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకునే ముందుకు వెళతారన్నారు.

తాజా పరిణామాలకు భాజపాను నిందించడంపై స్పందిస్తూ.. శరద్‌ పవార్‌, శివసేనకు చెందిన సంజయ్‌ రౌత్‌ పరిధిని దాటి తమ వాక్‌ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని పాటిల్‌ వ్యాఖ్యానించారు. అసలు శివసేన పార్టీలో ఏం జరుగుతుందో కూడా తాను పెద్దగా పట్టించుకోవట్లేదన్నారు. భాజపాకు చెందిన మోహిత్‌ కాంబోజ్‌ కూడా రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి గువాహటిలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపైనా పాటిల్‌ స్పందించారు. మోహిత్‌కు పార్టీలకతీతంగా మిత్రులున్నారన్నారు. బహుశా ఎవరికైనా సాయం చేయడానికి ఆయన అక్కడికి వెళ్లి ఉంటారన్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని