Ajit Pawar: ఆ సమావేశం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు: అజిత్‌ పవార్‌

ఇటీవల తన బాబాయ్ శరద్‌ పవార్‌తో జరిగిన భేటీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అది అతి సాధారణమైన సమావేశమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ పేర్కొన్నారు.

Published : 16 Aug 2023 02:02 IST

కొల్హాపుర్‌: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ (Sharad Pawar)తో ఇటీవల జరిగిన భేటీ అతి సాధారణమైనదేనని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ (Ajit Pawar) తెలిపారు. దీనిపై ఇప్పటికే శరద్‌ పవార్‌ కూడా క్లారిటీ ఇచ్చారన్నారు. కొల్హాపుర్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అజిత్‌ మాట్లాడారు. ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సమావేశంపై మీడియా తనకు నచ్చినట్టుగా, ఏవేవో కల్పించి చెబుతోందని, ప్రజలను ఆయోమయానికి గురిచేస్తోందని అన్నారు. శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ పుణెలో రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఓ వ్యాపారవేత్త ఇంట్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎన్‌న్సీపీ సీనియర్‌ నేత జయంత్‌ పాటిల్‌ కూడా హాజరయ్యారు. 

‘భేటీ అనంతరం కారులో రహస్యంగా ఎందుకు వెళ్లారు?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ కారులో తాను లేనని అజిత్‌ పవార్‌ చెప్పారు. రహస్యంగా తిరగాల్సిన అవసరం తనకు లేదని, ఏ పని చేసినా బహిరంగంగానే చేస్తానని అన్నారు. వ్యాపారవేత్త అతుల్‌ ఇంటికి శరద్‌ పవార్‌ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వస్తున్న విజువల్స్‌, అనంతరం  సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయిన దృశ్యాలు స్థానిక వార్తాఛానెళ్లలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో అజిత్‌ పవార్‌ కారులో వెళ్తున్న దృశ్యాలు కూడా మీడియా కంటపడ్డాయి. కానీ, తాజాగా ఆ కారులో తాను లేనని అజిత్‌ పవార్‌ చెప్పడం గమనార్హం.

అతుల్‌ కుటుంబంతో తమకు రెండు తరాల నుంచి మంచి సంబంధాలున్నాయని అజిత్‌ పవార్‌  పేర్కొన్నారు. ‘‘ శరద్‌పవార్‌ను శనివారం అతుల్‌ భోజనానికి ఆహ్వానించారు. అంతకుముందే వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఓ కార్యక్రమం ఖరారు కావడంతో.. జయంత్‌ పాటిల్‌తో కలిసి ఆయన అందులో పాల్గొన్నారు. ఆయన అక్కడి నుంచి నేరుగా వారిద్దరూ అతుల్‌ ఇంటికి వెళ్లారు. చాందిని చౌక్‌ వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నేను కూడా అక్కడికి వెళ్లాను’’ అని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై.. అజిత్‌ పవార్‌ వర్గం తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం అజిత్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఇటీవల శరద్‌ పవార్‌ను అజిత్‌ వర్గం పలుసార్లు కలిసినప్పటికీ అందుకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైంది. కానీ, పుణెలో భేటీ గురించి ఇద్దరు నేతలూ ఎలాంటి సమాచారాన్ని బయటకు చెప్పలేదు. సమావేశం తర్వాత కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని