సొంతగూటికి మాజీ సీఎం.. కాంగ్రెస్‌లో చేరిన గిరిధర్‌ గమాంగ్‌

Giridhar Gamang: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ 9 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతకుముందు భాజపా, భారాసలో కొన్నాళ్ల పాటు ఉన్నారు.

Published : 18 Jan 2024 02:20 IST

దిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 9 ఏళ్ల క్రితం పార్టీని వీడిన ఆయన.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ట్రెజరర్‌ అజయ్‌ మాకెన్‌ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య హేమ గమాంగ్‌, కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, భాజపా నేత, మాజీ ఎంపీ సంజయ్‌ భోయ్‌ ఉన్నారు. దేశంలో బాధ్యతాయుతమైన రాజకీయాలు చేసే పార్టీ ఒక్క కాంగ్రెసేనని పేర్కొన్నారు.

1972లో కొరాపుట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గమాంగ్‌ లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబరు 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 17న కేంద్రంలోని వాజ్‌పేయీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. గమాంగ్‌ వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ సర్కారు కూలిపోయింది. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గమాంగ్‌ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2015లో భాజపాలో చేరిన ఆయన కొన్నాళ్లకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2023 జనవరిలో భారాసలో చేరిన ఆయన ఆ పార్టీకీ గుడ్‌బై చెప్పారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. గమాంగ్‌ ఒడిశా సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన భార్య హేమ గమాంగ్‌ కొరాపుట్‌ నుంచి 1999లో లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. తాను పార్టీని వీడినా కాంగ్రెస్‌ ఆలోచనలు, సిద్ధాంతాలను వీడలేదని ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు