Ruturaj Gaikwad: జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్‌

పంజాబ్‌పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్‌లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు దూసుకొచ్చింది.

Published : 06 May 2024 08:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై మళ్లీ ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. ధర్మశాల వేదికగా పంజాబ్‌ను చిత్తు చేసింది. హైబ్రిడ్ విధానంలో రూపొందించిన పిచ్‌పై తొలిసారి మ్యాచ్‌ జరిగింది. బౌలర్లకు పూర్తి సహకారం అందించడంతో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. 

‘‘ప్రతి ఒక్కరూ పిచ్‌ గురించి స్పందించిన తీరు ఒకేలా ఉంది. చాలా మందకొడిగా ఉంది. బౌన్స్‌ కావడం లేదు. మేం బ్యాటింగ్‌ ప్రారంభానికి ముందు కనీసం 180 నుంచి 200 పరుగులైనా చేయాలని అనుకున్నాం. కొన్ని వికెట్లను చేజార్చుకున్నాక ఇక్కడ 160+ స్కోరు చేసినా సరిపోతుందని భావించాం. సిమర్‌జిత్‌ అద్భుతంగా బంతులేశాడు. ఈ సీజన్‌కు ముందు కూడా 150 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేసిన అనుభవం అతడి సొంతం. కానీ, ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇప్పుడేమీ మరింత ఆలస్యం కాలేదు. మొదట ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటర్‌ను తీసుకుందామని అనుకున్నాం. కనీసం 15 పరుగులైనా చేస్తాడు. జట్టుకు ఉపయోగపడతాడనేది అంచనా. కానీ, బౌలర్‌ అయితే రెండు లేదా మూడు వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు అవకాశం దక్కుతుంది. మా జట్టులో కొందరు క్రికెటర్లు జ్వరంతో బాధపడ్డారు. మరికొందరు గాయాలతో ఉన్నారు. మ్యాచ్‌ ముందు వరకు తుది జట్టులో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఎదురైంది. చివరికి విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది. కీలక సమయంలో పాయింట్ల పట్టికలో పైకి చేరాం’’ అని రుతురాజ్‌ తెలిపాడు. 

మేం బౌలింగ్‌ బాగానే చేశాం.. కానీ: కరన్

‘‘బౌలింగ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లేవు. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. సగం మ్యాచ్‌ వరకు మేం ఆధిక్యంలోనే ఉన్నాం. కానీ, బ్యాటింగ్‌ సమయంలో గందరగోళానికి గురై ఓటమిపాలయ్యాం. మేం అనుకున్నదానికంటే వికెట్‌ చాలా స్లోగా ఉంది. కనీసం పేస్, బౌన్స్‌ ఎక్కువ ఉంటుందని భావించాం. తర్వాత బెంగళూరును ఢీకొట్టనున్నాం. పుంజుకొని ఆ మ్యాచ్‌కు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది’’ అని పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ (Sam Curran) వెల్లడించాడు. 

ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యం: తుషార్‌

‘‘తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మేం గొప్ప విజయాన్ని నమోదు చేయగలిగాం. గత మ్యాచ్‌లో మాకు పెద్దగా కలిసి రాలేదు. ఈ సారి మాత్రం ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. ధర్మశాలలో పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుసు. కానీ, మరీ ఇంత నెమ్మదిగా మారుతుందని అనుకోలేదు. సరైన లెంగ్త్‌తో కూడిన బౌలింగ్‌ చేస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ షాట్లను కొట్టడం తేలికైన విషయం కాదు. కొత్త బంతితో త్వరగా వికెట్లను తీసేందుకు ప్రయత్నించి సఫలం కావడం ఆనందంగా ఉంది’’ అని చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే (Tushar Deshpandey) అన్నాడు. పంజాబ్‌పై తుషార్‌ 4 ఓవర్ల కోటాలో 35 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లను పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని